“కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు” అన్న సామెత తరచుగా సినిమాల్లో వినబడుతుంటుంది. సినీ తారల విషయంలో మాత్రం ఈ సామెత అంతగా వర్తించదేమో అనిపిస్తుంది. కారణం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు వారు కెరీర్ పై దృష్టి సారిస్తారే తప్ప వ్యక్తిగత జీవితంపై కాదు. పదేళ్లకుపైగా పరిశ్రమలో వుంది నేటికీ బిజీగా వున్నా అనుష్క, కాజల్ ఈ కోవకు చెందిన వారే. ఓ దశలో కాజల్ పనైపోయింది ఇక మూడు ముళ్ళు వేయించుకోడమే నయం అని గుసగుసలాడుకున్నారు. అయితే వాటికి ధీటుగా మళ్ళీ స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయిపొయింది ఈ అమ్మడు.
ఇటీవల “పక్కా లోకల్” అంటూ ప్రత్యేక గీతంతో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన కాజల్ ప్రస్తుతం ‘ఖైదీ నెం 150’లో చిరుతో ఆడిపాడితోంది. దీంతోపాటు తమిళంలోనూ అజిత్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇంత బిజీగా ఉన్న కాజల్ ను పెళ్లి తర్వాత కూడా నటిస్తారా అన్న ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చింది ముంబై భామ. “పెళ్లితో మరో కుటుంబంలోకి అడుగుపెడతాం. గనక వారి అభిప్రాయమూ కీలకమే. నాకైతే నటించాలనే ఉంది. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గనక ఆలోపు నాకు నచ్చిన పాత్రలన్నీ చేసెయ్యాలని నిర్ణయించుకున్నా. అవన్నీ అయ్యాకే పెళ్లి” అని చెప్పుకొచ్చింది కాజల్. ఈమెకు అలాంటి పాత్రలు ఎవరు సృష్టిస్టారో మరి..?