టాలీవుడ్ క్యూట్ నటి సమంత అక్కినేని కుటుంబానికి బాగా దగ్గరైంది. ప్రియుడు యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలిసి విహారానికే పరిమితం కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరవుతోంది. కింగ్ నాగార్జున తన పెద్ద కోడలు సమంత అని మీడియా ప్రతినిధులకు చెప్పడంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఎవరిని చూసి దాక్కోవలసిన అవసరం లేదు కనుక ఆనందంగా అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వస్తోంది.
నాగార్జున భార్య అమల, సమంత మాట్లాడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ అత్తా కోడళ్ల కంటే మంచి స్నేహితులుగా ఈ చిత్రాల్లో కనిపిస్తున్నారు. చైతు, సమంతల పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాక పోయినా సమంత ఎక్కువ సమయం అక్కినేని ఇంట్లోనే గడుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏ సినిమాకు సంతకం చేయని ఈ భామ కోడలిగా అక్కినేని ఇంట అడుగు పెట్టే శుభ సందర్భానికి చెందిన వార్త త్వరలోనే మనం విననున్నాం.