ఇప్పుడు సినిమా తారలు, వారి కుటుంబ సభ్యులకు ఈ మధ్య కాలంలో అనవసరమైన తలనొప్పి ఒకటి మొదలైంది. బయట ఎవరో ఒకటి మాట్లాడతారు.. వాటికి తారలు సమాధానాలు చెప్పుకోవాలి. సమాధానం సరిగ్గా చెప్పకపోయినా, పూర్తిగా చెప్పకపోయినా ఎవరికి నచ్చింది వారు అనేసుకుంటూ ఉంటారు. దీంతో వద్దు వద్దు అనుకుంటూనే రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది. ఇప్పుడు ఇంచుమించు ఇలాంటి పరిస్థితే వచ్చినట్లుంది ప్రముఖ నటుడు సత్యరాజ్‌కి.
నటుడు సత్య రాజ్ కుమార్తె పెళ్లి అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఏమైంది అంటూ సన్నిహితులు కనుక్కోవడం స్టార్ట్ చేశారు. దీంతో కుమార్తెపై వచ్చిన రూమర్లపై సత్యరాజ్ స్పందించారు. ఈ మేరకు వాటిని ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశారు. నా కుమార్తె, న్యూట్రిషియన్ దివ్య సత్యరాజ్ గురించి చాలా రకాల రూమర్లు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదు. నా కూతురు హార్డ్ వర్క్ చేసే రకం. గౌరవప్రదంగా జీవిస్తూ ఉంటుంది. స్వయంకృషితో ఎదిగింది. ఆమె విషయంలో నేను గర్వపడుతున్నా అని చెప్పుకొచ్చారు.
రూమర్ల సంగతి చూస్తే.. దివ్య సత్యరాజ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆమెకు పిల్లలు కూడా ఉన్నట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. వాటిని చూసిన నెటిజన్లు ఇవి ఏఐ ఫొటోలు అని చెప్పారు. కానీ కొంతమంది వాటిని నమ్మారు. దీంతో సత్యరాజ్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఎవరో చేసిన పనికి తండ్రి బయటకు వచ్చి తన కూతురుకు పెళ్లి కాలేదు అని చెప్పడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇదీ ఏఐ తీసుకొచ్చిన కష్టం.