ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. వందకు పైగా చిత్రాల్లో నటించిన నారాయణరావు 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్న ఆయన.. కృష్ట జిల్లా కురుమద్దాలిలో పుట్టారు. నారాయణ రావు బాల్యం, విద్యాబ్యాసం గుంతకల్లులో సాగింది. ఎ.ఆర్.కృష్ణ వద్ద నటన, గిడుగు విశాలాక్షి వద్ద భరత నాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు.
నారాయణ రావు చదువుకునే రోజుల్లో ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’, ‘ప్రతాప రుద్రీయం’, ‘మంచు తెర’ తదితర నాటకాలలో ఆయన నటించి మెప్పించారు. దివంగత నటులు కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు నారాయణరావుకు నాటకాలు వేసే రోజుల్లో మిత్రులు. నాటకాలతో కెరీర్ ప్రారంభించిన నారాయణ సినిమాలతో పాటు కొన్ని టీవీ సీరియళ్లలోనూ నటించారు. సినిమాల్లోకి వచ్చే ముందు మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న నారాయణరావు.. రజనీకాంత్, చిరంజీవికి మిత్రుడు.
‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ తదితర సినిమాల్లో నటించారు. ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్ళి నీకు శుభం నాకు’ సినిమాలను నిర్మించారు కూడా. నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం తెలిపింది. నారాయణరావు తండ్రి ప్రసాదరావు కొంతకాలం డిస్ట్రిబ్యూటర్‌గా, సారథి స్టుడియోలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేశారు.