‘టాక్సిక్’ సినిమాకు నిన్న రాత్రి వరకు బీభత్సమైన టాక్ వచ్చింది. సినిమా గురించి గొప్పగా చెప్పని వారు లేదరు. వాళ్లు కూడా సినిమాను ఆ స్థాయిలో ప్రమోట్ చేశారు. సౌత్ ఇండియా మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ఇటు టికెట్‌ల అమ్మకాల్లో, రేటింగ్‌ల్లో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ‘కేజీయఫ్’ లాంటి సినిమాల తర్వాత యశ్ నుండి వస్తున్న సినిమా కావడం, ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాల్లో చూపించిన కంటెంట్, ఐదుగురు హీరోయిన్లు ఇలా హైప్‌ని పెంచినవే.
కానీ డేట్ 25 నుంచి 26వ తేదీకి రాగానే మొత్తం పరిస్థితి మారిపోయింది. నిన్న మొన్నటి వరకు సినిమాను వేనోల పొగిడిన వాళ్లే ఇప్పుడు తూర్పారపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ సినిమా అవ్వడం ఆలస్యం.. సోషల్ మీడియాలో సినిమాను ఏకిపారేస్తున్నారు. ఒకట్రెండు మంచి విషయాలు చెబుతున్నా.. మిగిలిన విషయాలన్నీ సినిమాలోని ఇబ్బందులు, తప్పులు, తలనొప్పులు ఇలా అన్నీ ఆ పోస్టుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత అవసరమా, అది అవసరమా, ఇది ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇండియన్ సినిమాలో, ముఖ్యంగా సౌత్ సినిమాలో ఇలా సగం సినిమా అవ్వగానే ఇలాంటి ఇబ్బందికరమైన టాక్ అందుకున్న సినిమా లేదు. తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. వాటి గురించి సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. కానీ ‘టాక్సిక్’ సినిమా విషయంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దానికి కారణం సినిమాలో శ్రుతి మించిన సన్నివేశాలు, ఫైట్లు ఉండటమే కారణం అనిపిస్తోంది. అలాగే సినిమాను ముందుకు తీసుకెళ్లిన విధానం అంటే స్క్రీన్‌ప్లే సరిగ్గా లేదు.
మరి ఇంతటి డిజాస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎన్ని రోజులు నిలబడుతుందో చూడాలి. అన్నట్లు ఈ సినిమా ఫలితం తెలంగాణలో ఆ సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజుపైన కూడా పడింది. ‘ఇరుముడి’ సినిమాను తొక్కేసి ‘టాక్సిక్’కి థియేటర్లు ఇచ్చారంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఫలితం ఇలా రావడంతో ఆయన కూడా మాటలు పడుతున్నారు.