సినిమా హాల్ బుకింగ్ క్లర్క్‌గా తన జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల ఎగ్జిబిటర్, ఆ వెంటనే డిస్ట్రిబ్యూటర్, అటు నుంచి నిర్మాతగా ఎదిగిన సీనియర్ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు (89) కన్నుమూశారు. వయసు సంబంధిత సమస్యల కారణంగా విజయవాడలో ఇటీవల తుదిశ్వాస విడిచారు. విజయవాడలో నిర్వహించనున్నారు. వెంకటేశ్వరరావు మృతితో సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తన సంతాపాన్ని వ్యక్తం చేసింది.
సినిమా పరిశ్రమలో జేవీఆర్‌గా, జగపతి వెంకటేశ్వరరావుగా గుర్తింపు పొందారు చలసాని వెంకటేశ్వరరావు. జగపతి మూవీ క్రియేషన్స్ పతాకంపై సినిమాలను నిర్మించారు. ‘నేటి దౌర్జన్యం’ సినిమాతోపాటు బి.విఠలాచార్య దర్శకత్వంలో ‘కరుణించిన కనకదుర్గ’ సినిమాను ఆయనే నిర్మించారు. నందమూరి జానకి రామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమాను ఆయనే డైరెక్ట్ చేసి, నిర్మించారు కూడా. ఈ సినిమా బాలల చిత్రం కావడం గమనార్హం. ఆ ‘దాన వీర శూర కర్ణ’ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నంది అవార్డును కూడా గెలుచుకుంది.
సినిమాలు మాత్రమే కాకుండా ఆయనకు హోటల్ వ్యాపారం కూడా ఉంది. విజయవాడ గాంధీనగర్‌లో జగపతి పేరుతో హోటల్ నడిపారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కి సెక్రటరీగా కూడా పని చేశారు. దాంతోపాటు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో సభ్యుడిగానూ ఉన్నారు. ఆయన గత కొన్నేళ్లుగా విజయవాడలో ఓ వృద్ధాశ్రమం నిర్వహిస్తూ సమాజ సేవ కూడా చేస్తున్నారు. వెంకటేశ్వరరావు అంత్యక్రియలు గురువారం నాడు విజయవాడలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.