సూర్య, జ్యోతిక ప్రేమ, వివాహం ఆ తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడేటప్పుడు తమిళ సినిమా పరిశ్రమ, అభిమానుల్లో కచ్చితంగా వినిపించే టాపిక్.. ‘ఆ పెళ్లి విషయంలో సూర్య తండ్రి శివ కుమార్ అంత హ్యాపీగా లేరు’. ఇప్పటివరకు ఈ విషయంలో ఆయన కానీ, సూర్య – జ్యోతిక కానీ ఎప్పుడూ స్పందించలేదు. దీంతో సూర్య – జ్యోతిక విషయంలో శివకుమార్ ఆలోచన ఏంటి? అనే ఆనేది మాత్రం ఎవరికీ తెలియకుండా పోయింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయనెప్పుడూ మాట్లాడలేదు.
ఇప్పుడు తొలిసారి శివ కుమార్ ఈ విషయంలో మాట్లాడారు. సూర్య, జ్యోతిక తమ 20వ పెళ్లి రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వారి పిల్లలు దియా, దేవ్‌తోపాటు తమ్ముడు కార్తి కలసి ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో శివకుమార్ ఈ జంటపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శివ కుమార్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఎవరినీ ప్రేమించట్లేదేంటి?’ అని సూర్యను వాళ్ల అమ్మ ఓసారి అడిగింది. దానికి సూర్య ‘ఎవరు పడితే వాళ్ల మీద ప్రేమ పుట్టదు’ అని అన్నాడు. ఆ తర్వాత ముంబయికి చెందిన జ్యోతికతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని పట్టుబట్టాడు. ఆమె కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూశాడు అని శివ కుమార్ ఆ రోజు విషయాల్ని చెప్పుకొచ్చారు.
పెళ్లయ్యాక జ్యోతిక కావాలనుకుంటే సూర్యను ముంబయి తీసుకెళ్లి సెటిల్ అయ్యేది. అలా చేసి ఉంటే నేను ఏమీ అనలేకపోయేవాడిని. కానీ జ్యోతిక అలా చేయలేదు. తన సొంతూరుకి దూరంగా 18 ఏళ్లు మా కుటుంబంతోనే కలిసి ఉంది. అలాగే కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపించరు. కానీ జ్యోతిక అలా కాదు. మాతో పాటే ఉంటూ వచ్చింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. 20 ఏళ్లుగా నా కొడుకు, కోడలు అన్యోన్యంగా ఉండటం చూస్తుంటే ఓ తండ్రిగా గర్వంగా ఉంది అని అన్నారు శివ కుమార్. ఈ క్రమంలో ఇన్నాళ్లుగా సూర్య – జ్యోతిక విషయంలో శివ కుమార్ ఇలా ఆలోచిస్తున్నారు అంటూ వస్తున్న విమర్శలకు చెక్ చెప్పారు.