తన సంగీతం మీద తనకు ఎప్పటికీ హక్కులు ఉంటాయి అనేలా మాట్లాడుతూ ఉంటారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆ పాటను మళ్లీ వాడుకునేందుకుగాను మ్యూజిక్ సంస్థ, నిర్మాతల దగ్గర హక్కులు తీసుకున్నాం అని చెప్పినా ఆయన వినరు. ఇది ఇప్పటి మాట కాదు.. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఈ మేరకు ఆయన నోటీసులు పంపడం, కోర్టు మెట్లు ఎక్కించడం, వాదనలు జరగడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘అఘతియా’ సినిమాలో రీక్రియేటెడ్ వెర్షన్ లైసెన్స్ వివాదంపై ఇళయరాజా ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం కో్టు.. ‘మూడు పాని’ అనే సినిమాలో ఓ పాట వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఆ సినిమాలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే..’ అనే పాట కాపీ రైట్ వివాదంలో ఇళయరాజా అప్పీల్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
పాటలో ట్యూన్‌పై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పింది. పాటలోని సాహిత్యం, సౌండ్ రికార్డింగ్ కాపీరైట్ హక్కులు సంగీత దర్శకుడికీ సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. ఆ పాటకు సంబంధించి నిర్మాత నుండి హక్కులు పొందిన ‘సరిగమ’ మ్యూజిక్ లేబుల్‌కు అనుకూలంగా హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పుడు సుప్రీం కోర్టు సమర్థించింది.
1980లో వచ్చిన ‘మూడు పాని’ సినిమాలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే..’ పాటను 2025లో వచ్చిన ‘అఘతియా’ సినిమాలో వాడుకుని రీక్రియేట్ చేశారు. తన అనుమతి లేకుండా ఆ పాటను రీక్రియేట్ చేయడంపై ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో తమ సంస్థ కాపీరైట్ పొందిన సినిమాల పాటలకు ఇళయరాజా హక్కు కోరుతున్నారని సరిగమ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ పాటను ఆయన వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నట్లు కూడా కోర్టుకు తెలియచేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి స్టే విధించింది.
ఆ స్టేను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఇళయరాజా ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో ఈ విషయంలో ఇకనైనా ఆయన వెనకడుగు వేస్తారేమో చూడాలి.