ఈ రోజుల్లో పారితోషికం టైంకి అందకపోతే.. ‘ప్రమోషన్ కి రాను, డబ్బింగ్ చెప్పను, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వను’ అంటూ నిర్మాతల్ని వేధించే హీరోలు ఉన్నారు. అన్ని కరెక్ట్ గా అప్పగించినా.. ఏదో ఒక రకంగా ప్రమోషన్స్ డుమ్మా కొడుతున్న బ్యాచ్ ను కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీళ్లంతా ఒక్కసారి నానిని చూస్తే సిగ్గుపడటం గ్యారంటీ. విషయం ఏంటంటే.. నాని (Nani) హీరోగా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే సినిమా రూపొందింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) ఈ చిత్రానికి దర్శకుడు.
పక్కా యాక్షన్ మూవీ ఇది. ఇంకా చాలా ఆకర్షణలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం,కన్నడ..వంటి భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం. కాబట్టి నాని కూడా బెంగళూరు,ముంబై వంటి ఏరియాల్లో ప్రమోషన్స్ చేసి వచ్చాడు. హైదరాబాద్లో కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. మరోపక్క దర్శకుడు వివేక్ ఆత్రేయ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ప్రమోషన్స్ కి హాజరుకాలేకపోయాడు. అంతేకాదు ఇప్పుడు ఆయన విపరీతమైన జ్వరంతో హాస్పిటల్ పాలయ్యాడట.
దీంతో ఎడిటింగ్ టేబుల్ వద్ద నాని (Nani) కూడా కూర్చుంటున్నట్టు సమాచారం. పగలంతా ప్రమోషన్స్ చేసుకుని.. నైట్ అయ్యేసరికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వద్దకి వెళ్తున్నాడట నాని. ఇలా పగలనీ లేదు, రాత్రిని లేదు.. నాన్ స్టాప్ గా తన సినిమా కోసం కష్టపడుతున్నాడు. గత 5 రోజులుగా చూసుకుంటే కనీసం 10 గంటలు కూడా నిద్రపోకుండా కష్టపడుతున్నాడట. టాలీవుడ్లో ఇంత డెడికేషన్ కలిగిన హీరోలు ఇప్పుడు ఉన్నారా? అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.