ప్రముఖ గాయని మంగ్లీ పేరు ఇటీవల సోషల్ మీడియా, న్యూస్‌లో ఎక్కువగా నానుతోంది. ‘కేడీ: ది డెవిల్’ సినిమాలో ఆమె పాడిన పాట ఒక కారణం కాగా, మరో కారణం ఆమె ఫైనాన్స్ వ్యాపారం చేస్తోంది అంటూ ఆరోపణలు రావడం. గత కొన్ని రోజులుగా ఈ వ్యాపారం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె సోదరుడి గురించి కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై మంగ్లీ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.
మంగ్లీ పేరుతో రూ.కోట్లలో మైక్రో ఫైనాన్స్ మోసం జరిగిందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అధిక వడ్డీ ఆశ చూపించి రూ.కోట్లలో వసూలు చేశారని ఆ రూమర్ల సమాచారం. అయితే తనకు ఆ వ్యాపారాలతో సంబంధం లేదని మంగ్లీ పేర్కొన్నారు. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం రోజూ నన్ను, నా తమ్ముడిని చాలా మంది అప్రోచ్ అవుతారు. ఆ ఈవెంట్‌కు సంబంధించి ఇన్విటేషన్ వివరాల వరకే తప్ప వాళ్ల పర్సనల్ వ్యాపారాల గురించి తెలియదు అని మంగ్లీ రాసుకొచ్చారు.
ఆ వ్యవహారాలతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఏమాత్రం సంబంధం లేదు. ఇలాంటి విషయాల్లో నా పేరును వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం అన్యాయం అన్నారామె. అలాగే కొందరు కావాలనే తన వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్నారామె. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలకు మాకు సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు.
తనకు ప్రొఫెషనల్ ఈవెంట్స్ తప్పించి, ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు. నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుతున్నాను అని సోషల్ మీడియాలో పోస్టులో పేర్కొన్నారామె. మరి ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.