Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

ఒక వ్యక్తి విజయాన్ని లెక్కించడానికి కొలమానాలు ఏమన్నా ఉంటాయా అంటే తాము ఉన్న రంగంలో స్థాయిని పెంచుకోవడమే విజయానికి కొలమానం అని చెప్పాలి. అలా సినిమా రంగంలో కూడా స్థాయిని పెంచుకోవడమే కొలమానం. దీనికి ఓ అంశం అవార్డుల ఫంక్షన్‌లో నటులు కూర్చునే కుర్చీ. అవార్డులను అందుకోబోయే వాళ్లు స్టేజీ దిగువ తొలి వరుసలో కూర్చుంటే.. ఆహుతులు, సన్నిహితులు రెండో వరుస నుండి కూర్చుంటారు. అలా వెనుక కూర్చున్న నటుడు తొలి వరుసకు వస్తే చాలా పెద్ద విజయం. ఇప్పుడు అలాంటి విజయం అందుకున్నాడు ప్రముఖ తమిళ కథానాయకుడు శివకార్తికేయన్‌.

Siva Karthikeyan

ఈ గెలుపు అనుభూతి గురించి శివ కార్తికేయన్‌ ఇటీవల ఫిలింఫేర్‌ అవార్డుల వేడుకలో చెప్పారు. కొచ్చిలో జరిగిన ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డుల వేడుకలో ‘అమరన్‌’ సినిమాకుగాను అవార్డు అందుకున్న శివ ఆ తర్వాత మాట్లాడుతూ 13ఏళ్ల కిందట ఫిలిం ఫేర్‌ పురస్కారాన్ని అందుకోవడానికి వస్తూ తననూ ధనుష్‌ తీసుకొచ్చారని గుర్తు చేశారు. అప్పుడు తాను రెండో వరుసలో కూర్చున్నానని, మొదటి వరుసకు వచ్చేందుకు 13 ఏళ్లు పట్టిందని చెప్పుకొచ్చారు.

అలాగే ‘అమరన్‌’ సినిమా కోసం ఒప్పందం చేసుకునేటప్పుడు కమల్‌ హాసన్‌ కార్యాలయంలో ఉన్న చాలా పురస్కారాలు చూశానని తెలిపారు. అప్పుడు కమల్‌ ‘ఇక ఇవి నాకు చాలు, యువ కథానాయకుల పురస్కారాలు అందుకోవాలి’ అని అన్నారని నాటి రోజున జరిగిన సంఘటన గురించి శివ కార్తికేయన్‌ చెప్పారు. అది ఈ సినిమాతో జరిగిందని ఆనందంగా చెప్పారు. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్‌’ 8 విభాగాల్లో ఫిలిం ఫేర్‌ సౌత్‌ పురస్కారాలు అందుకుంది.

70వ ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌లో తమిళ సినిమా పరిశ్రమకు వచ్చిన అవార్డులు ఇవీ..
ఉత్తమ చిత్రం – అమరన్‌
ఉత్తమ దర్శకుడు – వినోద్‌రాజ్‌ (కొట్టుకాళి), రాజ్‌కుమార్‌ పెరియసామి (అమరన్‌),
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) – మెయ్యళగన్‌
ఉత్తమ నటుడు – శివకార్తికేయన్‌ (అమరన్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) – అరవింద్‌ సామి (మెయ్యళగన్‌)
ఉత్తమ నటి – సాయి పల్లవి (అమరన్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) – అనా బెన్‌ (కొట్టుకాళి)
ఉత్తమ సహాయ నటుడు – కార్తి (మెయ్యళగన్‌)
ఉత్తమ సహాయ నటి – శ్వాసిక (లబ్బర్‌ పందు)
ఉత్తమ సంగీతం – జీవీ ప్రకాశ్‌కుమార్‌ (అమరన్‌)
ఉత్తమ గేయరచయిత – ఉమాదేవి (యారో ఇవన్‌ యారో – మెయ్యళగన్‌)
ఉత్తమ నేపథ్య గాయకుడు -హరిచరన్‌ (హే మిన్నలే – అమరన్‌)
ఉత్తమ నేపథ్య గాయని – శ్వేతా మోహన్‌ (హే మిన్నలే – అమరన్‌)
అత్యుత్తమ నటన – విక్రమ్‌ (తంగలాన్‌)

‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus