మనం ఎప్పుడూ చెప్పేదే.. ఒక డిజాస్టర్ హీరోకు ఒకలా ప్రభావం చూపిస్తుంది, దర్శకుడికి మరోలా చూపిస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌కి నిలువెత్తు సమాధానం శ్రీకాంత్ ఓదెల. గతంలో చాలామంది ఉన్నారు కానీ.. రీసెంట్ కాబట్టి ఈయన పేరు చెప్పాం. ‘ది ప్యారడైజ్’ అంటూ నానితో కలసి వచ్చిన శ్రీకాంత్.. థియేటర్లలో ఎదుర్కొన్న నెగిటివిటీ కంటే.. ఓటీటీలోకి వచ్చాక అందుకున్న నెగిటివిటీ నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంది అంటే అతిశయోక్తి కాదు.
థియేటర్ రెస్పాన్స్ చూస్తేనే చిరంజీవి గతంలో ఓకే చేసిన సినిమా చేయడం కష్టం అనుకుంటే.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఇప్పట్లో శ్రీకాంత్‌ని చిరు కలవరు అనేస్తున్నారు. అయితే చిరు అలా చేస్తారా లేదా అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఆ సినిమా ఫలితం తన బుర్ర నుండి త్వరగా బయటకు తీసేయాలని శ్రీకాంత్ అనుకుంటున్నారట. అందుకే కొత్త సినిమా పనులు షురూ చేసేశారట. అవును ఓ లైన్ ఓకే చేసేసుకన్నారట.
అదే ప్రేమకథ. అవును హింసాత్మక సినిమాలతో ఇండస్ట్రీలో తన ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్.. ఈ సారి విభిన్నమైన ప్రేమకథను ఓకే చేసుకుంటున్నారు. పూర్తిగా కొత్తవారితో తెరకెక్కిస్తారు అని అంటున్న ఈ సినిమాను తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కిస్తారట. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బ్యాక్ డ్రాప్‌లో ప్రేమకథని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. విభజన సమయంలోని రాజకీయ అంశాలను కూడా మానవీయ అంశాలను చూపించే ప్రయత్నం చేస్తారట.
అయితే, ఈ ప్రయత్నం శ్రీకాంత్ కెరీర్‌కి చాలా కష్టం. ఎందుకంటే ‘ప్యారడైజ్’ అలాంటి ఎఫెక్ట్ ఇచ్చింది. ఆయన మేకింగ్, టేకింగ్ మీద అనుమానాలు రేకెత్తించింది. ఈ సమయంలో కాంట్రవర్శియల్ పార్టీషన్ టైమ్‌లో సినిమా చేస్తుంటే ఎటువైపు ఆయన పెన్ను మొగ్గుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కూడా ఇబ్బంది పడితే చిరు డోర్స్ ఇక మూసుకుపోతాయి. సో శ్రీకాంత్ గారు పారాహుషార్.