‘సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు’ ఈ చిత్రానికి సెపెరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకు అంటే 2013 సంక్రాంతి కానుకగా స్టార్ హీరోస్ మహేష్ బాబు, వెంకటేష్ కథానాయకులుగా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. మధ్య తరగతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సంభాషణలను, వారి మధ్య భావోద్వేగాలను, కుటుంబ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా తెర మీద ఆవిష్కరించారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ చిత్రంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ సమాజంలో ఎక్కడో ఒక చోట మనకు తారస పడినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా తండ్రి గా ప్రకాష్ రాజ్ నటించిన రేలంగి మావయ్య పాత్ర మంచితనానికి నిలువుటద్దంలా కనిపిస్తుంది. అయితే ఈ పాత్రకి మొదటగా టాలీవుడ్ లో ఒక సీనియర్ హీరోని అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ శ్రీకాంత్. ఆయన ఎవరంటే ?
‘ఆయుధం’, ‘మా అన్నయ్య’ , ‘ ఎవడైతే నాకేంటి’ సినిమాలతో ఒకానొక సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో రాజశేఖర్. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ సినిమాలో కీలకపాత్రలో నటించిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాంట్లో ఆయన తన సినిమా అనుభవాలను గురించి తెలియజేస్తూ ఈ విధంగా అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో రేలంగి మావయ్య పాత్రకు మొదటగా తనను సంప్రదించారని, మీ నవ్వు ఆ పాత్రకు చాలా బాగా సెట్ అవుతుందని చెప్పారని తెలిపారు. కానీ అనుకోని కారణాల వల్ల తనకు ఆ సినిమాలో నటించే అవకాశం మిస్ అయిందని చెప్పుకొచ్చారు.
కాగా, రేలంగి మావయ్య పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్, ఆ పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకుల మన్ననలను పొందటం, ఆ సినిమా సూపర్ హిట్ కావటం మనందరికీ తెలిసిన విషయమే.