సినిమా పేరు చూసినా, కాన్సెప్ట్ చూసినా, కాస్టింగ్ చూసినా.. ఎక్కడా సినిమా మీద నెగిటివిటీ లేదు. కానీ సినిమాలో ఏదో ఒక కంటెంట్ బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. తొలుత టైటిల్ విషయంలో ఇబ్బంది రాగా.. ఆ తర్వాత ఓ పాటలోని ఓ సన్నివేశం వల్ల వచ్చింది. వాటి వల్ల సినిమా పేరు ప్రేక్షకుల నోళ్లలో, సోషల్ మీడియాలో బాగానే నానింది. అలా ఎలా చేస్తారు అంటూ చాలా మంది సినిమా టీమ్‌ని ప్రశ్నించారు.
డిసెంబరు 11న ‘ఇడుపు కాయితం’ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. దానికి తగ్గట్టుగానే గత కొన్ని వారాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. అలా వచ్చినప్పుడల్లా వివాదం ఒకటి రావడం, దానికి సినిమా టీమ్ నుండి ఎవరో ఒకరు సమాధానం ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్త పాట విడుదల సందర్భంగా నిర్మాత తబితా సుకుమార్ ఓ క్లారిటీ ఇచ్చారు.
ఆమె సమర్పణలో ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా రూపొందిన సినిమా ‘ఇడుపు కాయితం’. ఇటీవల సినిమాలోని పెళ్లి పాటలో ‘ముక్క సుక్క’ అనే అంశం కనిపించింది. 16 రోజుల పండగ సందర్భంగా బంధువులకు మద్యం, మాంసాహారం వడ్డించే సన్నివేశం ఉంది. దీంతో పెళ్లిలో ఇలా చేస్తారా అంటూ కొంతమంది విమర్శించారు. దానికి అవును తెలంగాణలో ఇంతే అని కొందరు అనగా.. అవునా మేం ఎక్కడా చూడలేదే అని ఇంకొందరు అన్నారు.
ఈ విషయం మీద తబితా సుకుమార్ మాట్లాడుతూ ‘ముక్క సుక్క’ అనేది తెలంగాణ సాంస్కృతిక ఆచారం కాదు. పెద్దల పట్ల గౌరవాన్ని చూపించే ఒక పద్ధతి మాత్రమే అని ఆమె వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విమర్శకులు ఎంతవరకు ఓకే అవుతారో చూడాలి. ఎందుకంటే తెలంగాణలో పెళ్లిలో చుక్క – ముక్క అనేది కొన్ని వర్గాల్లో ఉంది. అది తెలిస్తే ఎవరూ ఏమీ అనకపోవచ్చు.