స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి తనయుడిగా తొలత బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).. అనతి కాలంలోనే మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. అటు తర్వాత హీరోగా మారి ‘మంగమ్మగారి మనవడు’ ‘సీతారాముల కళ్యాణం’ వంటి సూపర్ హిట్స్ అందించి టాప్ హీరోగా ఎదిగారు. తండ్రి వారసత్వాన్ని మాత్రమే కాదు.. నటనలో కూడా తండ్రికి తగ్గట్టుగా డెడికేషన్ తో పనిచేయడం బాలయ్యకి ఇష్టం. అందుకే ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వచ్చాడు బాలయ్య.
ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు బాలయ్య. అతనిలో ఉన్న గొప్ప నటుడితో చాలా ప్రయోగాలు చేశారు కొంతమంది దర్శకులు. అందులో బాలయ్య మాస్ ఇమేజ్ ను మ్యాచ్ చేస్తూ తీసిన సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తే.. మరికొన్ని సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అందుకే బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’ ‘నరసింహనాయుడు’ వంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకులు బి గోపాల్ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ వంటి డిజాస్టర్ సినిమాలు కూడా ఇవ్వగలిగారు.
అయినప్పటికీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేని స్టార్ ఇమేజ్ బాలయ్యది అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ‘లక్ష్మీ నరసింహ’ తర్వాత ఒక్క హిట్టు కూడా పడకపోయినా… ‘బాలయ్య పని అయిపోయింది’ అంటూ చాలా మంది విమర్శించినా.. ‘సింహా’తో సింహా గర్జన చేసి మాస్ లో తన రేంజ్ ఏంటో చూపించారు బాలయ్య. ఈరోజుల్లో ఒక్క హిట్ ఇవ్వడానికి సీనియర్ స్టార్ హీరోలు అంతా కిందా మీదా పడుతుంటే.. బాలయ్య మాత్రం కంటిన్యూగా హిట్లు ఇస్తూ.. ఒకప్పటి ఫామ్ ను గుర్తుచేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు బాలయ్య సినిమాల పై డిస్ట్రిబూటర్లకు, నిర్మాతలకి మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అని చెప్పాలి. బాలయ్యతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం వారిలో మరింతగా పెరుగుతూనే వస్తోంది. ఇక నిజజీవితంలో కూడా బాలయ్య హిందూపూర్ ఎం ఎల్ ఏ గా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్స్ అధినేతగా ప్రజలకి సేవలందిస్తున్నారు. తన సక్సెస్ జర్నీని కొనసాగిస్తున్నారు.
నిజజీవితంలో బాలయ్యపై ట్రోల్ చేసే వాళ్ళు ఉండొచ్చు. రాజకీయాల పరంగా విమర్శలు చేసేవాళ్ళు చేయొచ్చు. కానీ బాలయ్య వేటినీ కేర్ చేయకుండా దూసుకుపోతాడు అనేది అక్షర సత్యం. ఒక్క మాటలో బాలయ్య గురించి చెప్పాలంటే.. సినిమాల్లో ‘నట సింహం’. నిజజీవితంలో పసి పిల్లాడు. మనసులో ఏం పెట్టుకోడు. ఎలాంటి ఎమోషన్ అయినా వెంటనే బయటపెట్టేస్తాడు. ‘ఫిల్టర్ లెస్ పర్సన్’. ‘హ్యాపీ బర్త్ డే బాలయ్య’.