భారతీయ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా (84) (Bharathiraja) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీరాజా ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. తమిళంలోనే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమలో ఆయన తన ప్రభావం చూపించారు. దీంతో భారతీయ సినిమా పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనక గౌరవార్థం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
జులై 17, 1941న జన్మించిన భారతీరాజా 1977లో ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. ‘కొత్త జీవితాలు’ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ లాంటి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమకు బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించారు. కేవలం హిట్ సినిమాలే కాదు.. క్లాసిక్ సినిమాలు తీయడం ఆయన స్టైల్. వాటితోనూ భారీ విజయాలు అందుకున్నారు. మొత్తంగా 40కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
‘సీతాకోకచిలుక’ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’ సినిమాకు కథ, ‘పల్నాటి పౌరుషం’ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించి ఆ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. తొలినాళ్లలో దర్శకుడిగా మాత్రమే ఉన్న భారతీ రాజా ఆ తర్వాత నటుడిగా కూడా మెరిశారు. కీలక పాత్రల్లో వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు. ‘యువ’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు కొన్ని అతిథి పాత్రలు చేశారు. కొన్ని సినిమాల్లో ఇతర నటులకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఆయన నటించిన ‘దేశీయ తలైవర్’ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది.
ఇక భారతీరాజా సేవలకు గౌరవంగా భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. గతేడాది భారతీ రాజా కొడుకు మనోజ్ భారతీరాజా (48) (Bharathiraja) గుండెపోటుతో మృతి చెందారు. దీంతో భారతీరాజా కుంగిపోయారు. ఆ సమయంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఇటీవల నటి రాధిక ఆయన్ని కలిశారు. ఆ సందర్భంగా బయటు వచ్చిన వీడియోలో ఆయన బాగా వీక్‌గా కనిపించారు.