‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

ఎవరేమన్నా, ఎంతలా ప్రచారం చేసినా.. సినిమా పరిశ్రమలో ఫలితమే ముఖ్యం. అక్కడ ఫెయిల్‌ అయితే సినిమా రిలీజ్‌కి ముందు ఎన్ని చెప్పినా.. రిలీజ్‌ అయ్యాక ఎన్ని ‘కోట్ల’ పోస్టర్లు వేసినా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ మనీ మేటర్స్‌. ఎప్పుడో ఓ పదేళ్ల తర్వాత ‘ఆ సినిమా తేడా ఫలితం వచ్చినా క్లాసిక్‌, కల్ట్‌’ అంటూ రీరిలీజ్‌ చేసి సంబరపడిపోతారు. ఆ విషయం పక్కనపెట్టి ఫలితం గురించి చూస్తే.. ఈ ప్రభావం కేవలం హీరో మీద తక్కువగా.. దర్శకుడు, నిర్మాత మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ‘సినిమాలో ఎక్కువ చేతులు పెట్టకూడదు’ అంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ మధ్య విడుదలైన ఓ సినిమా సాధించిన తేడా ఫలితం.. ఆ సినిమా రిలీజ్‌కి ముందు ఆ హీరో వివిధ ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలే కారణం. ‘నన్ను నమ్మి నేను అన్నీ చూసుకుంటా అని నాతో సినిమా చేస్తున్నారు. ఆ నిర్మాత కోసం నేను సినిమాలో వేళ్లు, చేతులు పెడితే తప్పేంటి?’ అని ఆ హీరో ఓ లెంగ్తీ ఇంటర్వ్యూలో అన్నారు. ఇది సరికాదు కదా.. చాలామంది అంటున్నారు కదా అంటే.. ‘నన్ను నమ్మారు మరి’ అంటూ ఆ మాట మీద గట్టిగా నిలబడ్డారు. పోనీ ఈ మాట హిట్‌ సినిమా ఇచ్చి అన్నారా అంటే అంతకుముందు ఫ్లాపే ఉంది.

కానీ, ఇప్పుడు చూస్తే ఆ సినిమా తేడా ఫలితం కొట్టింది. కారణమేంటా అని ఇండస్ట్రీ వర్గాల దగ్గర ప్రస్తావిస్తే.. డైరక్టర్‌ రాసుకున్న కథ.. ఫైనల్‌గా తెర మీదకు వచ్చిన కథ ఒకటి కాదు అనే ఓ మాట బయటికొచ్చింది. కథకు వంటగాళ్లు పెరిగిపోవడంతో ఈ సమస్య వచ్చిందనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో ‘నీ మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు.. జాగ్రత్తగానే ఉండాలి కదా ‘బోయ్‌’ అనే మాట వినిపిస్తోంది. చూద్దాం మరి తర్వాత చేసే సినిమాలకైనా ‘యాక్షన్‌’ చేసి ఇంటికెళ్తాడేమో. ఎందుకంటే ఆయనకు అలా వెళ్లాలి అనే కోరిక చాలా ఏళ్లుగా ఉందట. కానీ నిర్మాతల కోసం అన్ని పనులూ చేస్తున్నాడట.

హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల.. బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus