ఇది కొన్నేళ్ల క్రితం మాట.. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటి మాట. ఆ సమయంలో సినిమా టికెట్ రేట్లను అప్పటి ప్రభుత్వం దశాబ్దాల పాత రేటుకు మార్చేసింది. ఎందుకు అని అడిగితే.. అంతే ఉండాలి అని అన్నారు. ఆ సమయంలో తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు మామూలుగా ఉండేది కాదు. దాంతో బాబోయ్ ఇంత పెంపా అని అనుకునేవారు. అయితే ఇప్పుడు ఏపీలో టికెట్ల రేట్ల స్పెషల్ పెంపు ఏపీ కంటే తెలంగాణనే బెటర్ అనేలా చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరెలా తప్పుపడతున్నారు అనేది పక్కన పెడితే.. ఇలాంటి పెంపు అవకాశాన్ని పొందుతున్న ప్రముఖ నిర్మాత నాగవంశీనే ఎక్కువ మాటలు పడుతున్నారు. దానికి కారణం ఆయన చిన్న సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు సదుపాయాన్ని పొందుతున్నారు. మొన్నీ మధ్య ‘జైలర్ 2’ సినిమాకు కూడా ఏపీలో టికెట్ల రేట్ల పెంపు ఇవ్వడంతో నాగవంశీ మీద విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు కూడా టికెట్ల రేట్ల పెంపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల పెంపు విషయంలో గతంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. అవేవీ ఈ సినిమాలు పాటించలేదు. కానీ టికెట్ రేట్ల పెంపు పొందారు. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ.75 (జీఎస్టీతో కలిపి), సింగిల్ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అలాగే రోజుకు ఐదు షోలను కూడా ప్రదర్శించుకునే వెసులుబాటూ కల్పించింది. విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి.
వెంకటేశ్ సినిమాలకు, అందులోనూ భారీ బడ్జెట్ లేకుండా, మీడియం బడ్జెట్‌లో రూపొందిన సినిమాకు టికెట్ ధరల పెంపు నష్టమే కలిగిస్తుంది అనేది నెటిజన్ల అభిప్రాయం. మరి ఇన్ని మాటలు పడుతున్నా నాగవంశీ ఎందుకిలా చేస్తున్నారో ఆయనకే తెలియాలి.