తెలంగాణలో సినిమా టికెట్ ధరల మార్పు, థియేటర్ల గ్రేడింగ్ తదితర అంశాలపై ఇటీవల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో తాము సంతృప్తిగా లేము అని థియేటర్ల ఓనర్లు చెప్పకనే చెప్పారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాస్తామని చెప్పారు. అన్నట్లే ఇప్పుడు లేఖ రాసేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 నిర్మాతలకు అనుకూలంగా, ఏకపక్ష నిర్ణయంలా ఉందని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆరోపించింది.
సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల ఎగ్జిబిటర్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను కాపాడాలని కోరింది. తెలంగాణలోని 400కుపైగా థియేటర్లను సంప్రదించకుండా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమేయం లేకుండా ఈ జీవో విడుదల చేశారని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో పాటు కొంత మంది నిర్మాతల కోసం ఈ జీవో ఇచ్చారని విమర్శించారు.
తెలంగాణలో టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో 99 శాతం థియేటర్లు ఎయిర్ కూల్డ్‌గానే ఉన్నాయి. కొవిడ్ తర్వాత పెట్టుబడి పెట్టి వాటిని ఆధునీకరించాం. అలా ఈ మూడేళ్లలో థియేటర్ల మరమ్మతుల కోసం ఎగ్జిబిటర్లు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేశాం. అయితే ఇప్పుడు తమ సొంత ఆస్తికి టికెట్ ధరలను నిర్ణయించుకునే హక్కును ప్రభుత్వం జీవోతో లాక్కుంది అని లేఖలో పేర్కొన్నారు. థియేటర్ల ఆక్యుపెన్సీ, నిర్వహణ ఖర్చుల రిస్క్‌ను భరించేది ఎగ్జిబిటర్లే అని గుర్తు చేశారు.
థియేటర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు, విద్యుత్తు బిల్లులు ఎగ్జిబిటర్లే చెల్లిస్తారు. ఇక థియేటర్‌ల వర్గీకరణలో జీవోలో వివక్ష చూపారు. చిన్న పట్టణాల్లో ఒక్కో స్క్రీన్‌ను ఏసీగా మార్చేందుకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలు అవుతుంది. అయితే కొత్త జీవో వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉంది. అలాగే మల్టీఫ్లెక్స్‌లకు ఇస్తున్న ఆదాయంలో వాటాను సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో టికెట్ ధరలు పెంచడం వల్ల ఎగ్జిబిటర్లకు ప్రయోజనం ఉండదు అని ఆ లెటర్‌లో పేర్కొన్నారు.