సీనియర్ హీరో వడ్డే నవీన్ గురించి ఇప్పటి జెంజీ ఆడియన్స్ కి తెలిసుండకపోవచ్చు. కానీ గతంలో ఆయన ఫ్యామిలీ సినిమాలతో సూపర్ హిట్లు అందుకుని ఓ వెలుగు వెలిగారు. శోభన్ బాబు రేంజ్ లేడీ ఫాలోయింగ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ను ఆస్వాదించినవారే. తర్వాత ఫ్లాపులు పలకరించడంతో డౌన్ అయ్యారు. అప్పటికీ అడపా ధడపా ‘ఎటాక్’ వంటి సినిమాల్లో నటించినా ఫాంలోకి రాలేకపోయారు. దీంతో సినిమాలకి ఆయన గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.
ఆ గ్యాప్ కూడా 10 ఏళ్ళు కావడం షాక్ ఇచ్చే అంశం. మొత్తానికి ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'(Transfer Trimurthulu) అనే సినిమాతో వడ్డే నవీన్ రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. లుక్స్ విషయంలో నవీన్ ఏమాత్రం మారలేదు. అప్పుడెలా ఉన్నారో.. ఇప్పటికీ అలానే ఉన్నారు. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాని ఇప్పటి ఆడియన్స్ కూడా ఓన్ చేసుకునేలా చాలా కష్టపడి పనిచేసినట్టు నవీన్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. చాలా వరకు నవీన్ రియాలిటీలో మాట్లాడటం అనేది అభినందించాల్సిన విషయం.
అంతేకాదు రిలీజ్ కి ముందే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాకి ఓటీటీ బిజినెస్ కంప్లీట్ అవ్వడం చెప్పుకోదగ్గ విషయం. ఇక ఈ చిత్రానికి కమల్ తేజ నార్లా దర్శకత్వం వహించగా వడ్డే నవీన్ తన సొంత బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ’55 ట్రాన్స్ఫర్లు అయిన ఒక కానిస్టేబుల్ కరణంగా కొంతమంది పోలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. దీంతో వాళ్ళు త్రిమూర్తులుని అలాగే అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు.
వారి ఒత్తిడిని తట్టుకుని త్రిమూర్తులు ఎలా నిలబడగలిగాడు.? తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకున్నాడు?’ అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ బాగున్నాయట. ఒకటి రెండు ట్విస్టులు కూడా అలరిస్తాయని తెలుస్తోంది. మరి రిలీజ్ రోజు ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయో చూడాలి.