Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Advertisement

యూట్యూబ్‌లో ఓసారి త్రివిక్రమ్‌ స్పీచ్‌ అని సెర్చ్‌ చేస్తే.. టాప్‌ లిస్ట్‌లో కనిపించే ప్రసంగం ఒకటి ఉంటుంది. ఓ వేదిక మీద ప్రముఖ గేయ రచయిత, దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పిన అక్షర అమృతాల వీడియో కనిపిస్తుంది. మరీ దాని సాటికి రాకపోయినా.. నేటి తరానికి నాటి తరాన్ని రుచి చూపించే ప్రయత్నం చేస్తూ త్రివిక్రమ్‌ చేసిన ఓ ప్రాస ప్రసంగం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది మహోత్సవాలు ఆయన ప్రసంగానికి వేదికయ్యాయి.

Trivikram

ఇక్కడ మాట్లాడే అర్హత నాకెంత ఉందో తెలియదు. పూర్వ విద్యార్థిని అనే అభిమానంతో నన్ను ఆహ్వానించినట్టు ఉన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు నాకు పెద్దగా అవగాహన లేదు. ఇక్కడ నుండి వెళ్లిపోయాకే అవగాహన వచ్చింది. విభిన్నమైన ఆలోచనలను కలిపి ఒక చోటుకి తీసుకొచ్చే కేంద్రాన్ని యూనివర్సిటీ అంటారనేది నా అభిప్రాయం. ఇక్కడ చెప్పే దాని కన్నా మీరు నేర్చుకునే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది అంటూ ప్రసంగాన్ని స్టార్ట్‌ చేశారు త్రివిక్రమ్‌.

ఫిజిక్స్‌ ప్రాథమిక సూత్రం ప్రకారం.. ఎనర్జీని మీరు సృష్టించలేరు, నాశనం చేయలేరు. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చగలరు అంతే. దీనిని అన్నింటికీ అప్లై చేయండి. మనం పుట్టక ముందూ ఈ ప్రకృతి ఉంది.. మనం వెళ్లిపోయాక కూడా ఉంటుంది. మనం కనుగొనక ముందే ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం గుర్తించకపోయినా ఇక్కడే ఉంటాయి. మనం చూడటంలోనే ఉంది తప్ప అవి ఉండటంలో ఎలాంటి తేడా లేదు అని నాకు అనిపిస్తుంటుంది. ఉన్న వాటిని చూసి నేర్చుకోవడానికి ఉపయోగపడే ఓ వేదికగా యూనివర్సిటీ అని భావించాలి అని చెప్పారు మాటల మాంత్రికుడు.

ఆంధ్రా యూనివర్శిటీ ఓ విశాల ప్రాంగణం. ఎవరొచ్చినా తొలుత భయపెడుతుంది. 500కిపైగా ఎకరాలు.. ఎంత నడిచినా తరగదు.. ఎత్తైన సీలింగ్‌లు.. దూరంగా ఉండే క్లాస్‌ బోర్డులు.. వినిపించీ వినిపించకుండా ఉండే ప్రొఫెసర్ల మాటలు.. ఇవన్నీ ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్లిపోదామా అని అనిపించేలా చేస్తాయి అంటూ యూనివర్శిటీ గురించి విద్యార్థుల మనసులో మాటల్ని బయటపెట్టారు త్రివిక్రమ్‌. మందు ఎప్పుడైనా చేదుగానే ఉంటుంది. ఆస్పత్రి వాసన సుగంధంలా అనిపించదు. కానీ, మనకు అవి ఉపయోగపడతాయి. మనల్ని బాగు చేస్తాయి. మళ్లీ అరోగ్యవంతుడిని చేస్తాయని జీవిత పాఠం చెప్పారు త్రివిక్రమ్‌.

యూనివర్శిటీని కూడా అలాగే అలవాటు చేసుకోండి. అవగాహనలోకి తెచ్చుకోండి. ఎందుకంటే వేర్వేరు ప్రాంతాల నుండి ఇక్కడకు వస్తాం. మన భాషే గొప్పది. మన మాటే గొప్పది అని అనుకుంటాం. వేరే విషయాలను కూడా అంగీకరించాలన్నది నేర్పడానికే ఈ కేంద్రం ఉంది. నేనిక్కడ ఫిజిక్స్‌ చదువుకునేందుకు వచ్చి, పొయెట్రీ ఎక్కువగా రాశాను. తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. ఈ విశ్వవిద్యాలయం నాకు ఏదో ఒక విషయం నేర్పింది. దాంతోనే జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నా అని తన ఆలోచనలు, దారిలో వచ్చిన మార్పుల గురించి చెప్పారు గురూజీ.

‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus