ధనుష్ ప్రధాన పాత్రలో ‘పొర్ తొళిల్’ సినిమా ఫేమ్ విఘ్నేశ్ రాజా రూపొందించిన చిత్రం ‘కర’. చాలా రోజుల క్రితమే ఏప్రిల్ 30 అని రిలీజ్ డేట్ ప్రకటించేసినా పెద్దగా ప్రచారం చేయకపోవడంతో తెలుగులో సినిమా వస్తుందా లేదా అనే డౌట్ ఉండింది. కానీ సినిమా బృందం ఇప్పుడు తెలుగులో ప్రచారం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ గురించి డైరక్టర్ చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
‘కర’ సినిమాలో హీరోయిన్‌గా చైత్ర జె.ఆచార్‌ను అనుకున్నాం. దాని కోసం లుక్ టెస్ట్ కూడా చేశాం. కానీ, శశికుమార్ ‘మై లార్డ్’ సినిమాలో కూడా ఆమె అలాంటి లుక్‌లోనే నటించింది అని అనిపించింది. ఆ సినిమాను ‘కర’ సినిమా కన్నా ముందే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దీంతో రెండు సినిమాల్లోని హీరోయిన్ గెటప్పు సేమ్ ఉంది అనుకుంటారన్న ఉద్దేశంతో మమితా బైజును కాంటాక్ట్ అయ్యాం అని విఘ్నేశ్ రాజా చెప్పుకొచ్చారు.
అయితే, ఆమె ఓకే చేస్తుందా లేదా అనే డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే మమితా ఇప్పటివరకూ హుషారైన పాత్రలే చేసింది. ‘కర’ సినిమాలోని పాత్ర వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దీంతో ఆమె ఓకే చెప్పదేమో అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత నటిస్తానని ఆమె చెప్పడంతో సర్‌ప్రైజ్ అయ్యాను అని దర్శకుడు చెప్పారు. ఇదన్నమాట ‘కర’ సినిమాలోకి మమిత రావడానికి ముందు జరిగింది.
మరో కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ తన సినిమా ఎంట్రీ ఎలా జరిగింది అని చెప్పారు. కుటుంబ పరిస్థితుల కారణంగా 16 ఏళ్లకే తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చానని చెప్పారు. అదే సమయంలో తన కొడుకు సినిమాల్లోకి వచ్చే విషయం గురించీ మాట్లాడాడు. యాత్రకు ఇప్పుడు 19 ఏళ్లు. భవిష్యత్తులో ఏమవుతాడో నాకింకా తెలియదు. సినిమాల్లోకి వస్తాడా లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేను’’ అని అన్నాడు ధనుష్.