పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ ‘ఫౌజీ'(Fauzi). హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమా సెట్స్ లో తాజాగా ఓ ఘోర విషాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మని ఒక చిన్న విషపురుగు కాటేసిందట.
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫౌజీ’ షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ ను నిర్వహిస్తున్నారు.రోజువారీ షూటింగ్ ముగించుకున్న అనంతరం, రాజేష్ శర్మ తోటి నటీనటులతో మాట్లాడుతూ సరదాగా సమయాన్ని గడుపుతున్నాడట. అదే టైమ్లో రాజేశ్ శర్మ కుడికాలి పాదంపై ఒక పురుగు కుట్టిందట. అది చిన్న పురుగే అని భావించి మొదట రాజేశ్ శర్మ పట్టించుకోలేదట.
కానీ కొన్ని గంటల తర్వాత రాజేష్ శర్మకు.. ఒక్కసారిగా తీవ్రమైన నొప్పులు, విపరీతమైన జ్వరం మొదలయ్యాయి అని తెలుస్తోంది. ఆ తర్వాత అతను హైదరాబాద్ నుండి కలకత్తాకు బయల్దేరాడట. కానీ విమాన ప్రయాణంలో ఉండగా పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది. షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడంలో రాజేశ్ శర్మ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
దీంతో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే కలకత్తాలోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో రాజేష్ శర్మని అడ్మిట్ చేశారట.అప్పటికే మోకాలి వరకు ఇన్ఫెక్షన్ పాకినట్టు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన అతన్ని ఐసీయూ (ICU) కు తరలించినట్టు సమాచారం.