కొన్నాళ్ల నుండి థియేట్రికల్ రిలీజ్ కి నోచుకోక.. ఎట్టకేలకు ఓటీటీ ద్వారా విడుదలైన చిత్రం “విద్య వాసుల అహం” (Vidya Vasula Aham) . నవ దంపతుల మధ్య వచ్చే విభేదాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాహుల్ విజయ్(Rahul Vijay) -శివానీ రాజశేఖర్ (Shivani Rajashekar) కీలకపాత్రలు పోషించారు. ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ: వైజాగ్ మహానగరంలో పెళ్లీడు కొచ్చిన కుర్రాడు వాసు (రాహుల్ విజయ్) & అమ్మాయి విద్య (శివానీ రాజశేఖర్). భిన్న ధృవాల్లాంటి వీళ్లిద్దరూ కనీసం ఫోటోలు కూడా చూసుకోకుండానే పెళ్లి చూపులకు వెళ్లి.. ప్రైవేట్ గా పది నిమిషాలు మాట్లాడుకుంటామని చెప్పి మిద్దె మీద సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకుని.. పెద్ద గ్యాప్ లేకుండా పెళ్లి చేసుకొని ఒకటైపోతారు.
ఇప్పుడు మొదలవుతుంది అసలు ఆట. పెళ్ళైన పది నెలలకే ఇద్దరి మధ్య అహం దాపురించి నానా తిప్పలు పెడుతుంది. ఈ అహాన్ని విద్య & వాసు ఎలా అధిగమించారు? అనేది ఈ చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు: రాహుల్ విజయ్ కి మంచి స్క్రీన్ ప్రెజన్స్ ఉంటుంది. కుర్రాడిలో చలాకీతనం తెరపై చక్కగా కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో కామెడీ పేరుతో చేయించిన ఓవర్ యాక్షన్ మాత్రం అతడి పాత్రకు మైనస్ అయ్యింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ను క్రియేట్ చేసుకొని కామెడీ చేసి ఉంటే సరిపోయేదేమో కానీ.. ఎవర్నో ఇమిటేట్ చేస్తున్నట్లుగా ఉండడం రాహుల్ కి సెట్ అవ్వలేదు. లుక్స్ విషయంలో రాహుల్ కాస్త వర్కవుట్ చేయాల్సి ఉంది.
అచ్చమైన తెలుగమ్మాయిలా శివానీ రాజశేఖర్ ఒదిగిపోయింది. సగటు నవతరం యువతి ఆలోచనలు, జీవన శైలిని ఆమె పాత్ర ద్వారా ఎలివేట్ చేసిన విధానం, సదరు క్యారెక్టరైజేషన్ ను ఆమె ఒదిగిపోయిన తీరు ప్రశంసనీయం.
రఘుబాబు (Raghu Babu) , అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala), శ్రీనివాస్ రెడ్డి (Srinivasa Reddy) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నీషియన్స్ లో అందరికంటే ముందుగా, కాస్త ఎక్కువగా ప్రశంసించాల్సింది ఆర్ట్ డైరెక్టర్ ని. విద్య వాసుల గృహాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ చక్కదిద్దిన తీరు, సందర్భానుసారంగా సన్నివేశంలోని మూడ్ కి తగ్గట్లుగా బ్యాగ్రౌండ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అభినందనీయం.
కల్యాణి మాలిక్ (Kalyan Koduri) సంగీతం వినసొంపుగా, అర్ధవంతమైన సాహిత్యంతో సన్నివేశాన్ని, సన్నివేశంలోని ఎమోషన్ ను ఎలివేట్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సినిమాటోగ్రఫీ వర్క్ లో మాత్రం బడ్జెట్ పరిమితులు వల్ల మంచి క్వాలిటీ కనిపించలేదు. కొన్ని ఫ్రేమ్స్ లో లైటింగ్ సరిగా లేదు. ఇంకొన్ని ఫ్రేమ్స్ లో షాట్ కంపోజిషన్ సరిగా ఎలివేట్ అవ్వలేదు. అలాగని పెద్ద మైనస్ కాదు, కాకపోతే ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలకు కావాల్సిన స్థాయిలో అవుట్ పుట్ లేదు.
ప్రొడక్షన్ డిజైన్, డి.ఐ & సౌండ్ మిక్సింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే కొన్ని పాటలు, మాటలు అర్దమవ్వడానికి చెవులు రిక్కించి వినాల్సి వచ్చింది. ఇక మాటల రచయిత ప్రాసల కోసం ప్రాకులాడిన విధానం అక్కడక్కడా ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా కాస్త ఇబ్బందిపెట్టింది.
దర్శకుడు మణికాంత్ ఓ చిన్న కథను పెద్ద కాన్వాస్ మీద ఆకట్టుకునేలా తెరకెక్కిద్దామని చేసిన ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించలేదనే చెప్పాలి. ఈ తరహా రిలేటబుల్ కథలకు సన్నివేశాల రూపకల్పన చాలా ముఖ్యం. సినిమా మొత్తం దాదాపుగా రెండు మూడు లోకేషన్స్ లో సపోర్టింగ్ రోల్స్ తీసేస్తే ఇద్దరు పాత్రధారుల మధ్యనే నడుస్తుంది. అందువల్ల.. ప్రేక్షకులకు సినిమా ఎక్కడికీ కదలడం లేదనే భావన కలుగుతుంది. మెయిన్ స్టోరీతోపాటు సబ్ ప్లాట్స్ కూడా సినిమాకి అవసరం అనే విషయాన్ని దర్శకుడు గ్రహించి ఉంటే అవుట్ పుట్ వేరే విధంగా ఉండేది.
విశ్లేషణ: ఇది ఓటీటీ సినిమా, చేతిలో రిమోట్ & ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు!
ఫోకస్ పాయింట్: వైవిధ్యం కొరపడిన “విద్య వాసుల అహం”
రేటింగ్: 2/5