విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతోంది అంటే రెండు రకాల అంశాలు పక్కాగా ఉంటాయి. ఒకటి ఆ సినిమా మీద ఆయన అండ్ ఆయన టీమ్ పెంచే హైప్. రెండోది తన సినిమాను, తనను తొక్కేయాలని కొందరు చూస్తున్నారు అంటూ ఆయన చెప్పే మాటలు. ‘రణబాలి’ సినిమా విడుదల సందర్భంగానూ ఇదే జరిగింది. ఇటీవల సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగినప్పుడు విజయ్ చెప్పిన మాటలు చూస్తుంటే ఈ సినిమాకు సంబంధించి ‘ఆఖరి రాగం’ పాడేశాడా అనిపిస్తోంది.
కావాలంటే మీరే చూడండి.. తన సినిమా రాకుండా, ఇంకా ఆ సినిమా ప్రచారం ఆశించిన స్థాయిలో మొదలుపెట్టకుండానే తన సినిమాను ఎలా తొక్కేస్తారు అనే విషయాన్ని వివరంగా లెక్కలు కట్టి మరీ చెప్పాడు. నాపైనా, నా సినిమాల పైనా జరుగుతున్న దాన్ని విద్వేషం అనలేం. పనిగట్టుకొని కొన్ని గ్రూపులు నా సినిమా గురించి పోస్ట్‌లు పెడుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అందులో తప్పు లేదు అని అన్నాడు.
అయితే అక్కడితో ఆగకుండా కొందరు 50 అకౌంట్లు పెట్టుకుని, అన్నింటిలోనూ ఒకే లాంటి పోస్ట్ పెడతారు. ‘తెలుగు సినిమా అయిన ‘రణబాలి’ కాకుండా మనం ‘జైలర్ 2’ సినిమాకు పోదాం’’ అని సడెన్‌గా 50 అకౌంట్స్ నుండి ఒకే రీల్ షేర్ అవుతుంది. అందరూ ఒకే అభిప్రాయాన్ని రీల్‌గా షేర్ చేస్తున్నారంటే, ఎవరో కూర్చొని డబ్బులు పెట్టి మరీ చేయిస్తున్నారని అర్థం కదా అని అన్నాడు విజయ్. అంతేకాదు వ్యవస్థ అలా తయారైంది. దీన్ని మనం ఆపలేం అని కూడా అన్నాడు.
ఇప్పుడు డబ్బులు ఇచ్చి నా సినిమాను ఇబ్బంది పెడుతున్నవాడు రేపు ఇదే పని ఏఐతో ఆ పనిచేయిస్తాడు. అప్పుడు ఈ పని చేసే వాళ్లు ఏం చేస్తారు? సినిమాను ప్రచారం చేయడానికి నేను సపోర్ట్ చేస్తా. అప్పుడు ఎవరో ఒకరు బాగుపడతారు. అదే టూల్‌ను ఒకరిని కిందకు లాగడానికి ఉపయోగిస్తే ‘ఎందుకురా ఈ పనులు?’ అనిపిస్తుంది అని అన్నాడు విజయ్. ఈ లెక్కన రేపొద్దున సినిమా ఫలితం విషయంలో ఏమైనా ఇబ్బంది వస్తే.. ‘నేను ముందే చెప్పాను కదా.. అలానే చేశారు’ అని విజయ్ అనే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా ఆడి.. పరిశ్రమకు మంచి వసూళ్లు అందిస్తే ఈ దసరా సరదాగా ఉంటుంది. చూద్దాం శింగనమల బొబ్బిలి ‘రణబాలి’ థియేటర్ల దగ్గర ఏం చేస్తాడో?