తెలుగు సినిమా బయటకు కనిపించేంత మంచిగా ఏమీ లేదు.. చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటుంటారు. అయితే ఈ మాటను ఇటు అవును అనరు, అటు కాదు అనరు.. కానీ కామ్‌గా ఉంటారు మన సినిమా పెద్దలు. అయితే టాలీవుడ్ సీనియర్ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో తరచూ తమ ఆందోళనను వినిపిస్తూ ఉంటారు. అలా సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కూడా తెలుగు సినిమా పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన నిర్మాతలు, దర్శకులు, రచయితలు ఉన్నారు. టాలీవుడ్‌లో గొప్ప సినిమాలు చేసే నైపుణ్యం ఉంది కానీ పరిశ్రమ మాత్రం ఇబ్బందులు పడుతోంది అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. దానికి కారణం కూడా చెప్పుకొచ్చారాయన. చిత్ర పరిశ్రమలోని కొందరి గుత్తాధిపత్యం, డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీ లాంటి అంశాల వల్ల టాలీవుడ్ ఇబ్బందులు పడుతోంది అని చెప్పారు. అందు వల్లే చాలామంది నిర్మాతలు సినిమాలకు దూరంగా ఉంటున్నారు అని కూడా చెప్పారు.
చిన్న సినిమాలకి ప్రభుత్వ సహకారం ఎంత అవసరమో.. చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారమూ అంతే అవసరం. చాలామంది నిర్మాతలు చిన్న సినిమాల్ని తీయడం మానేస్తున్నారు. థియేటర్లలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్‌ఓ వసూలు చేసే ఛార్జీలు, పర్సెంటీజీ విధానం, ఫుడ్ రేట్లు ఇలా చాలా రకాలుగా దోపిడీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ మనుగడ కోసం చాలా మార్పులు చేయాలి అని ఆయన సూచించారు.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొచ్చి.. చిన్న నిర్మాతల్ని పిలిచి మాట్లాడి వాళ్ల వాయిస్ వినాలని చదలవాడ కోరారు. వాళ్లకు అవసరమైన ముఖ్య విషయాలపై హామీలు ఇవ్వాలి. అలాగే మినీ థియేటర్లని ప్రోత్సహిస్తేనే తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాకు తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు.