కొంతమంది హీరోల సినిమాల రిలీజ్‌లు ఉన్నా లేకపోయినా.. టైమ్ చూసుకొని ఫ్యాన్స్ మీట్ పెడుతూ ఉంటారు. ఇంకొందరు హీరోలు సినిమాలు రిలీజ్‌కి దగ్గరగా ఉన్నప్పుడు ఫ్యాన్స్ మీట్ పెడుతూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే టాలీవుడ్‌లో ఓ యవ హీరో తన ఫ్యాన్స్ మీట్ పెట్టారు. ఇలాంటి మీటింగ్‌లను నిర్వహించడంలో మంచి అనుభవమే ఉన్న ఓ సంస్థ.. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఇబ్బందులు పడటంతో.. మొత్తంగా కార్యక్రమం ఆపేసి.. అందరినీ ఇంటికి పంపించేశారు.
హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్ వేదికగా అభిమానులతో విశ్వక్‌సేన్ ఓ ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశాడు. అయితే నిర్వహణ లోపమో, గణనలో లోపమో తెలిదు కానీ.. సమావేశం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఊహించని రీతిలో వేలాదిగా ఫ్యాన్స్ రావడంతో తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఫొటోషూట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో అభిమానులు ఆగ్రహానికి లోనై అక్కడున్న ఫ్లెక్సీలను చించేసి నిరసన వ్యక్తం చేశారు.
పాస్‌లు ఉన్నవారితోపాటు.. లేనివారు కూడా ఈవెంట్‌కి రావడంతో ఈ ఇబ్బంది ఎదురైంది అని చెబుతున్నారు. సుమారు వెయ్యి మందితో విశ్వక్ ఫొటోలు దిగాడు. ఆ తర్వాత మిగిలిన వారిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో అర్ధాంతరంగా ఫొటో షూట్ ఆపేశారు. ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఇలా ఎలా చేస్తారంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
ఇక ఈ ఘటనపై విశ్వక్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. అభిమానులకు, శ్రేయోభిలాషులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఊహించని దాని కంటే మీ నుండి ఎక్కువ రెస్పాన్స్ రావడంతో అందరినీ కలవలేకపోయాను. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అందరితో ఫొటోలు దిగలేకపోయాను. నాతో ఫోటో దిగాలని వచ్చి నిరాశ చెందిన ప్రతి అభిమానికి క్షమాపణలు చెబుతున్నాను. మరో ఫొటో సెషన్ ఏర్పాటు చేసి మీ అందరితో ఫొటోలు దిగుతా అని పేర్కొన్నాడు.
ఇక ‘కల్ట్’ సినిమా గురించి చూస్తే.. విశ్వక్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 30న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.