ఇండియన్ సినిమాలో ‘రామాయణం’ గురించి మాట్లాడుకుంటే చాలా మంది పేర్లే వినిపిస్తాయి. అందులో ఓ పేరు అల్లు అరవింద్. ఆయన పేరు ఎందుకు.. ఆయనేం ‘రామాయణం’ సినిమా తీశారు అనుకుంటున్నారు. ఆయన సినిమా తీయలేదు కానీ ఆ సినిమాను భారీ స్థాయిలో అనౌన్స్ చేశారు. అప్పట్లో మధు మంతెన అనే బాలీవుడ్ నిర్మాతతో కలసి బాలీవుడ్‌లో ‘రామాయణ’ సినిమాను తీయాలని అనుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావన లేదు.
ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన అనుకుంటున్నారా? నవంబరు 5న విడుదల కాబోతున్న ‘రామాయణ’ పార్ట్ 1 సినిమానే ఆ సినిమా అయి ఉండేది అనేది గతం తవ్వితే తెలుస్తున్న అంశం. తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే 2017 టైంలో నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్, మధు మంతెన కలసి రామాయణంని సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. అధికారికంగా మొదలుపెట్టలేదు కానీ సినిమా పనులు అయిత మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 500 కోట్లకుపైగా బడ్జెట్ అనుకున్నారు.
అప్పట్లో వచ్చిన సమాచారం అయితే టాలీవుడ్ స్టార్ హీరోనే రాముడిగా ఫిక్స్ అయ్యారట. మిగిలిన క్యాస్టింగ్ కూడా స్టార్ హీరో హీరోయిన్లతో ఫిల్ చేయాలని అనుకున్నారట. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ సైలెంట్ అయిపోయింది. అప్పుడు ఈ సినిమాను హ్యాండిల్ చేస్తారు అని వచ్చిన పేరు నితేశ్ తివారి. అవును ఇప్పుడు ‘రామాయణ’ సినిమా తీసిన ఆయనే. కాబట్టి అప్పుడు అనుకున్న ఆలోచనే ఇప్పుడు వస్తోంది అని ఓ అంచనా.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. నిజంగా తొమ్మిదేళ్ల క్రితం వారు అనుకున్నట్లుగా తెలుగు హీరోతో సినిమా చేసి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో. ‘రావణుడి’ని హైలైట్ చేస్తుండటం ఇప్పుడు సినిమాకు పెద్ద మైనస్ అవుతోంది మరి. అన్నట్లు ఆ టాలీవుడ్ హీరో ఎవరో చెప్పలేదు కదా.. ఇంకెవరు రామ్‌చరణ్. అయితే అధికారికంగా ఎవరూ చెప్పలేదు.