సంక్రాంతికి తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్నేళ్లుగా మరపురాని సందడి నెలకొంటోంది. అదే అదనుగా, అదనపు ఆదాయంగా భావించి వరుస రోజుల్లో సినిమాలు విడుదల చేస్తుంటారు. పెద్ద హీరోల సినిమాలు, మీడియం హీరోల సినిమాలు కూడా వచ్చేస్తుంటాయి. దీంతో థియేటర్ల సర్దుబాటు ఒకప్పుడు ఇబ్బందిగా ఉండేది. అయితే అదంతా సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా ఉన్న రోజులే. మల్టీప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్ లాంటి థియేటర్ల సంఖ్య పెరగ్గానే ఈ ఇబ్బంది పోయింది అనుకోండి.
అయితే.. ఇప్పుడు మల్టీప్లెక్స్ చైన్ స్క్రీన్లకు ఆ సమస్య రుచి తెలియబోతోందా? అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. అయితే ఈ సంగతి తేలడానికి సంక్రాంతి వరకు ఆగక్కర్లేదు. డిసెంబరు 24నే ఈ విషయంలో క్లారిటీ వచ్చేయబోతోంది. ఎందుకంటే ఆ రోజున రెండు పెద్ద ఇంగ్లిష్ సినిమాలు, ఒక పెద్ద బాలీవుడ్ సినిమా, రెండు పెద్ద తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో మల్టీప్లెక్స్ వాళ్లకు స్క్రీన్లను అడ్జెస్ట్ చేయడం సమస్య కాబోతోంది అనిపిస్తోంది.
డిసెంబరు 24న రాబోతున్న/ వస్తాయంటున్న తెలుగు సినిమాల సంగతి ముందు చూస్తే.. నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ‘దాదా’ అదే డేట్‌కి ఫిక్స్ అయ్యాయి. ఇటీవలే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్‌లు ప్రకటించారు. ఇద్దరూ ‘మేం వస్తామంటే మేం వస్తాం’ అనే మాట మీదనే నిలబడి ఉన్నారు. ఇవి కాకుండా తెలుగులో మరో చిన్న సినిమా కూడా అదే డేట్ అంటున్నారని టాక్.
ఇక బాలీవుడ్ సంగతి చూస్తే.. షారుఖ్ ఖాన్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘కింగ్’ను ఇదే డేట్‌కి తెస్తామని చాలా నెలల క్రితమే చెప్పారు. అయితే ఆ డేట్ మారొచ్చని వార్తలొచ్చాయి. కానీ అదే డేట్‌కి వస్తామని షారుఖ్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు హాలీవుడ్ నుండి డిసెంబరు 18న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ సినిమాను తీసుకొస్తున్నారు. ‘డ్యూన్ 3’ కూడా అదే రోజు రానుంది. ఈ సినిమాలను కనీసం రెండు, మూడు వారాలు ఆడించాలని మల్టీప్లెక్స్‌లు చూస్తాయి. దీంతో వారం గ్యాప్‌లు ఇన్ని సినిమాలు వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారనేదే ప్రశ్న.