అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)లో ఏం జరుగుతోంది. మొన్నటికి మొన్న అమ్మ అధ్యక్షుడుగా ఉన్న మోహన్ లాల్ దిగిపోయి కొత్త అధ్యక్షురాలుగా శ్వేత మీనన్ ఎన్నికయ్యారు. దీనికి కారణం మాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ దుమారం రేగడం, కొంతమంది అసోసియేషన్ సభ్యుల మీద కూడా ఆరోపణలు రావడం లాంటివి కారణాలు. ‘అమ్మ’ అసోసియేషన్ మారడం వల్ల మాలీవుడ్ మళ్లీ నార్మల్ పరిస్థితికి వస్తుంది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మళ్లీ మాలీవుడ్‌లో తిరిగి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి.
ఎందుకంటే అమ్మ అధ్యక్షురాలు శ్వేత మీనన్ రాజీనామా చేశారు. అమ్మ వార్షిక సర్వసభ్య సమావేశం ఇటీవల జరిగింది. ఆ తర్వాత శ్వేత మీనన్, ఆమె నేతృత్వంలోని 17 మంది కార్యవర్గ సభ్యులు రాజీనామా చేశారు. అంతకుముందు జరిగిన సమావేశంలో అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయట. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుకూ పరమేశ్వరన్ సమర్పించిన వార్షిక నివేదికలోని లెక్కల్లో తేడాలున్నాయని కొంతమంది సభ్యులు ఆరోపించారు. దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
శ్వేత మీనన్ సమావేశం తర్వాత మాట్లాడుతూ.. సెప్టెంబరు 1 నుండి మా ఆర్థిక వివరాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. కానీ అంతకుముందు కమిటీకి సంబంధించి సమస్యలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల చేతికే సంఘాన్ని మళ్లీ అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారామె. అలాగే నేను కీలు బొమ్మగా మారడానికి సిద్ధంగా లేను అని కామెంట్ చేసి.. ఆమెను వెనుకుండి ఎవరో నడిపించాలని చూశారని, అది నచ్చక బయటకు వచ్చేశానని చెప్పకనే చెప్పారామె.
ఈ మాటలన్నీ చూస్తుంటే.. మాలీవుడ్‌లో, అమ్మలో ఏదో జరుగుతోంది అనే చర్చ మొదలైంది. అలాగే ఇప్పుడు ‘అమ్మ’ అధ్యక్షుడు/ అధ్యక్షురాలు ఎవరవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే శ్వేత మీనన్ ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి.