జేపీ ఫిల్మ్స్.. ఈ సినిమా బ్యానర్ గురించి ఇప్పటితరం ప్రేక్షకులకు చాలా తక్కువమందికి తెలుసు. అయితే నిన్నటి తరం సినిమా జనాలకు ఆయన బాగా పరిచయం. ఆయనే జేపీ దత్తా. 1985లో దర్శకుడిగా తొలి సినిమా చేసిన ఆయన.. 2018 వరకు యాక్టివ్‌గానే ఉన్నారు. ఆ తర్వాత సినిమాలు తగ్గించేశారు. ఇలా చెబితే ఆయనెవరు అనేది క్లారిటీగా తెలుగుసుకోలేరు. కానీ ‘బోర్డర్’, ‘రెఫ్యూజీ’, ‘ఎల్‌వోసీ కార్గిల్’ సినిమా దర్శకనిర్మాత ఆయనే. రీసెంట్‌గా వచ్చిన ‘బోర్డర్ 2’కి ఆయనో నిర్మాత.
ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అనుకుంటున్నారా? ‘బోర్డర్ 2’ సినిమా ఇచ్చిన విజయం నేపథ్యంలో జేపీ ఫిల్మ్స్ కొత్త సినిమాలకు సిద్ధమవుతోంది. అందులో ఒకటి భారత సైన్యానికి చెందిన యుద్ధ వీరుడు హర్‌బక్ష్ సింగ్ జీవిత కథ కూడా ఉంది. 1965 ఇండియా – పాకిస్థాన్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి నాయకత్వం వహించిన యుద్ధ వీరుడు జనరల్ హర్‌బక్ష్ సింగ్.
ఇది కాకుండా ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. అయితే ఏం చూపించబోతున్నారు అనేది చెప్పాల్సి ఉంది. ఓ నిధి వేటకు సంబంధించిన యాక్షన్ అడ్వెంచర్ కథను సినిమాగా రూపొందించాలని అనుకుంటున్నామని చెప్పారు. అలాగే ఓపీ దత్తా జీవితంపై ఓ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నట్లు కూడా చెప్పారు. ఇవన్నీ రెండు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కాకుండా ‘బోర్డర్ 3’ సినిమాను అనౌన్స్ చేసింది టీమ్. తొలి ‘బోర్డర్’కు మొత్తంగా దత్తా ఫ్యామిలీనే అన్నీ చూసుకుంది. అంటే రచన, మాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నిర్మాణం అన్నీ వారే చూసుకున్నారు. రెండో పార్టుకు వచ్చేసరికి జేపీ దత్తా కేవలం నిర్మాణంలోనే ఉన్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. కథను నిధి దత్తా ఇచ్చారు. ఇప్పుడు మరి మూడో పార్టు విషయంలో ఏం చేస్తారో చూడాలి.