Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

అపోలో ఆసుపత్రి దగ్గర నిన్న ఉదయమంతా ఫ్యాన్స్‌ సందడి, హడావుడి చూసి మెగా ఫ్యాన్స్‌ చాలా ఆనందపడి ఉంటారు. రామ్‌చరణ్‌ మరోసారి తండ్రి అయిన ఆనందం, చిరంజీవి మరోసారి తాత అయిన ఆనందం అభిమానులకు కూడా ఉంది కదా అందుకే అలా అంత మంది ఆసుపత్రి దగ్గరకు వచ్చి ఆనందపడిపోయారు అనుకుని ఉంటారు. అయితే సాయంత్రానికి పరిస్థితి మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఆనందం, సరదా, హడావుడి అన్నవాళ్లు.. జరిగిన ఓ సంఘటన తర్వాత ఇదేం పైత్యం, అరాచకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.

Apollo Issue

జరిగిన ఆ సంఘటనే రామ్‌చరణ్‌, తన బిడ్డ క్లీంకారతో కారు దిగి బయటకు వచ్చినప్పుడు అభిమానం పేరుతో అందరూ చుట్టుముట్టేసి ఇబ్బంది పెట్టడం. దాదాపు తోపులాట జరిగింది. చరణ్‌ ఆసుపత్రిలోపలకు వెళ్లడానికి చాలా ఇబ్బందిపడ్డారు. వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. మొత్తంగా నెట్టేస్తూ పైకొచ్చేశారు. దీంతో అసలు దీనికి కారణమెవరు? అపోలో ఆసుపత్రి దగ్గర అలాంటి సిట్యువేషన్‌ ఎందుకొచ్చింది అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో రెండు వర్గాలవైపూ వేళ్లు చూపించే పరిస్థితి ఏర్పడింది.

అపోలో ఆసుపత్రే అని కాదు.. ఏ అసుపత్రి దగ్గరైనా ఆ రేంజిలో జనాలు రావడం, రప్పించడం, వచ్చేంతవరకు ఊరుకోవడం తప్పే. ఆసుపత్రిలో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఉంటారు. వీళ్ల సరదా వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ఇక చిరంజీవి ఫ్యామిలీ ఇబ్బంది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అంతమంది అక్కడకు వచ్చేసరికి సెక్యూరిటీ ఏం చేస్తోంది. ఒకవేళ సెక్యూరిటీ లేకపోతే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమూ ఉంది. పోనీ ఫ్యాన్స్‌ చూడటానికి వచ్చారనే అనుకుందాం.. వచ్చి అంత రచ్చ చేయాలా?

ఇక్కడే ఇంకో పాయింట్‌ ఉంది. అసలు ఉపాసన డెలివరీ డేట్‌ బయటకు చెప్పింది ఎవరు? పక్కాగా జనవరి 31 రాత్రి 11.30 అని మరీ ప్రచారం చేశారు. ఇది చరణ్‌ వ్యక్తిగత బృందం చేసిన పనా? లేక పీఆర్‌ టీమ్‌ లీక్‌ చేసిందా? ఎప్పుడైతే డేట్‌, టైమ్‌ బయటకు వచ్చిందో? మొత్తం ఫ్యాన్స్‌, జనాలు ఆసుపత్రి దగ్గరకు వచ్చేశారు. దీంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తప్పెవరిదో చిరంజీవి అండ్‌ ఫ్యామిలీ చెక్‌ చేసుకోవాలి. చిన్న బిడ్డతో చరణ్‌ వస్తే అలా నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్‌ అనేది ఫ్యాన్స్‌ ఆలోచించుకోవాలి.

ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus