సంక్రాంతికి నా సినిమా ఒకటి రావాలి.. దాని కోసం ఎంత వేగంగా అయినా పనులు పూర్తి చేస్తాను అని అనుకోవడం తప్పులేదు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా సినిమాను పూర్తి చేయడంలోనూ తప్పులేదు. అయితే సంక్రాంతికి సినిమా రావాలి అని టైటిల్‌లో సంక్రాంతి అని పెట్టేయడం, రిలీజ్ డేట్స్ పెట్టేయడం సరైన పనేనా? గత రెండు రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే చర్చ జరుగుతోంది. ఇదంతా అనిల్ రావిపూడి గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. తన కొత్త సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ పెట్టేసరికి ఈ చర్చ మొదలైంది.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) గత సినిమాలు చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. అందులోనూ గత రెండు సినిమాలు చూస్తే ఇంకా అర్థమవుతుంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను జనవరి 12న తీసుకొచ్చారు. ఆ సినిమా టైటిల్ ట్యాగ్ లైన్‌లో ‘పండగకి వస్తున్నారు’ అని పెట్టేసి లాక్ చేశారు. అంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేశారు. ఆ సినిమా టైటిల్‌లోనే అలా పెట్టేసి లాక్ చేశారు. అలా ఆ సినిమాలు సంక్రాంతికి విడుదల చేసేలా ఫిక్స్ చేసేశారు. అలానే అయ్యాయి కూడా.
అంతకుముందు కూడా అనిల్ రావిపూడి (Anil Ravipudi) సంక్రాంతి బొమ్మలు రెండు తెరకెక్కించారు. అవే ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’. ‘ఎఫ్ 2’ సినిమాలో ఎలాంటి లాక్‌లు లేకపోయినా.. ‘సరిలేరు నీకెవ్వరు’లో సంక్రాంతి లాక్ ఉంది. సినిమా ప్రచారం అంతా ‘ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు’ అనే డైలాగ్‌తోనే చేశారు. దీంతో ఆ సినిమా సంక్రాంతికే తీసుకురావాల్సి వచ్చింది. ఇదంతా చూస్తుంటే అనిల్ రావిపూడి ఎందుకిలా చేస్తున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది.
ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన ఆయరన సినిమాల్లో ఏదీ.. సంక్రాంతికే రావాల్సిన సినిమా కాదు. ఆ ఎలిమెంటూ లేదు. కావాలనే ఇరికించి రిలీజ్ చేశారు అనిపిస్తోంది. మరి ఇది అనిల్ రావిపూడికి (Anil Ravipudi) ఓవర్ అనిపించడం లేదా?