గతవారం 4,5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తెలుగు సినిమాలు రెండే రెండు. ఒకటి ‘మా ఇంటి బంగారం’ మరొకటి ‘దీవానా'(Deewana). బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ‘దీవానా’ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల ఈ సినిమాని జనాలు పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టింది.
పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి ఇలాంటి సక్సెస్ మీట్లు పెట్టి పుష్ చేయడంలో తప్పు లేదు.అయితే పేరుకే ఇది సక్సెస్ మీట్ అని పెట్టారు. వాస్తవానికి ఇది కాంట్రోవర్షియల్ మీట్ అనుకోవాలి. ఎందుకంటే.. సాధారణంగా సక్సెస్ మీట్లలో ‘మా సినిమా బాగుంది.. థియేటర్ కి వచ్చి చూస్తున్నందుకు థాంక్స్.. మీడియా వాళ్ళు ఇంకా పుష్ చేయండి’ అంటూ చెప్పుకుంటారు. కానీ ‘దీవానా’ సక్సెస్ మీట్లో మాత్రం ప్రతి ఒక్కరూ సెన్సార్ బోర్డు వారిని టార్గెట్ చేస్తూ స్పీచ్..లు ఇవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది.
‘మాది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమా, కానీ మా సినిమాకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళని దూరం చేశారు’ అంటూ మేకర్స్ అంతా మైక్ పట్టుకుని ఊగిపోయారు.నిజం చెప్పాలంటే ‘దీవానా’ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ సినిమా. ఇందులో లవ్ స్టోరీకే కాదు ఫ్రెండ్షిప్ వాల్యూస్, ఎమోషనల్ పేరెంట్స్ ట్రాక్ అన్నీ ఉన్నాయి. కానీ టీజర్, ట్రైలర్ వంటివి అన్నీ ‘ఇది లవ్ స్టోరీ.. యూత్ఫుల్ సినిమా’ అనే ఫీల్ ఇచ్చాయి. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ‘దీవానా’ సినిమాని పట్టించుకోలేదు.
ముందుగా మేకర్స్ ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయలేదు. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి అనే విధంగా ప్రోమోస్ రిలీజ్ చేసింది లేదు. సెన్సార్ వాళ్ళు ‘ఎ’ రేటింగ్ ఇచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.కాకపోతే మల్టీప్లెక్స్ కి మాత్రం 18 ఏళ్ళ లోపు ఉన్న వారికి ఎంట్రీ ఉండదు. అలా కలెక్షన్స్ పై పడే అవకాశం ఉంది. పైగా ‘దీవానా’ లాంటి సినిమాకి ఎక్కువగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే టీం బాగా అప్సెట్ అయినట్టు ఉంది.
అయితే ముందుగానే ఈ విషయం పై ఓ ఆలోచనకి వచ్చి.. సెన్సార్ వాళ్ళతో ఇంకాస్త సంప్రదింపులు చేసి యు/ఎ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసుండాల్సింది. అందుకు మరో వారం టైం తీసుకుని ఉండాల్సింది. అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇప్పుడు రిస్క్ చేసినట్టు అయ్యింది. అయితే అల్లు అరవింద్ వంటి బడా నిర్మాత రిలీజ్ చేసిన సినిమాకి ఇలాంటి ఓ సమస్య వస్తుందని ఆయన ముందు ఊహించలేదా?!