‘పెద్ది’ సినిమా బాగుందా? బాగోలేదా? జనాలకు నచ్చిందా? నచ్చలేదా? వసూళ్లు తెచ్చిపెడుతుందా? రావడం లేదా? ఈ డిస్కషన్ జరగాల్సిన సమయంలో మరో విషయం దీనికి దాటేసి సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అదే ‘జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర చిత్రణ. ఆ సినిమాలో జాన్వీ పాత్రను మరీ ఇబ్బందికరంగా చిత్రీకరించారు, రాసుకొచ్చారు అని దర్శకుడు బుచ్చిబాబు సానా మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించి సినిమాలో ఇబ్బందిపడుతున్నాం అని ఫ్యాన్స్/విశ్లేషకులు చెప్పిన వాటిని తొలగించారు. ఈ క్రమంలో ఇంత భయపడటమా అనే విమర్శలూ వచ్చాయి బుచ్చిబాబు మీద.
ఇదిలా ఉండగా కొంతమంది ఫ్యాన్స్, విశ్లేషకులు చెప్పిన మాటల ప్రకారం చూస్తే.. మోటు ప్రేమ, ఘాటు స్కిన్ షో వారికి నచ్చడం లేదు. ఓ హీరోయిన్ పాత్రను ఇలా రాసుకొస్తారా అనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పాత్రలు తెలుగు సినిమాల్లో ఇదేం తొలిసారి కాదు. గతంలో కొన్ని సందర్భాల్లో, కొన్ని సినిమాల్లో చూశాం కూడా. దానికి అప్పట్లో బోల్డ్ పాత్ర, ధైర్యవంతురాలి పాత్ర అంటూ మెచ్చేసుకున్నారు ప్రేక్షకులు, నెటిజన్లు. కానీ ఇప్పుడు ‘పెద్ది’ విషయానికొస్తే ఒప్పుకోవడం లేదు.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించిన మరో తెలుగు సినిమా ‘దేవర’లో పాత్రను ఇంచుమించు ఇలానే రాసుకొచ్చారు. ఇక పాన్ ఇండియా హిట్ ‘పుష్ప: ది రూల్’ సినిమాలో ఓ పాట, అంతకుమందు సీన్ వరకు హీరోయిన్ పాత్రను, డ్రెస్‌లను ఇబ్బందికరంగానే చూపించారు. ఇలా ఒకట్రెండు సినిమాలే కాదు చాలా సినిమాల్లో హీరోయిన్ పాత్ర పైట లేని సీన్లు చాలానే ఉన్నాయి. ఇక శ్రుతి మించిన సీన్ల విషయం అయితే సరేసరి. ఇక నోరు జారుడు మాటలు హీరోయిన్ల పాత్రలు చాలానే ఉన్నాయి. అప్పుడు అది అందం, బోల్డ్‌నెస్ అయితే ఇప్పుడు అతి ఎందుకైంది.. ఎందుకు ‘అచ్చియమ్మ’ విషయంలో ప్రేమ కలుగుతుందో అర్థం కావడం లేదు.
ఆ పాత్రను అలా చూపించే విషయంలో బుచ్చిబాబుకు సపోర్టు చేయమని ఎవరూ కోరుకోరు. కానీ ఇదే తెలుగు సినిమాలో తొలిసారి అనేలా ఎందుకు రచ్చ జరుగుతోంది అనేది ఇక్కడ పాయింట్. జాన్వీ పాత్ర గురించి బాలీవుడ్ మీడియా కూడా చర్చిస్తోంది. అక్కడి సినిమాల్లో ఇలాంటి పాత్రలు చాలానే ఉన్నాయి మరి.