పండగ అందరికీ పండగే.. అయితే సినిమా ఫ్యాన్స్‌కి డబుల్ పండగ. ఎందుకంటే ఆ రోజు తమ అభిమాన హీరోల సినిమాల పోస్టర్లు, అప్‌డేట్స్ వస్తాయి. వాటి కోసం ఆ రోజు అర్ధరాత్రి నుండి తెగ వెతికేస్తారు. ఈసారి కూడా అలా కొన్ని సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి. అయితే వాటిలో స్టార్ హీరోల సినిమాలు, త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల అప్‌డేట్స్ రాలేదు. కొన్ని వాయిదా వేయగా.. ఇంకొన్ని సినిమాలు ముఖం చాటేశాయి. దాంతో విడుదల విషయంలోనూ ఇలాగే చేస్తారా అనే డౌటనుమానం వస్తోంది.
దసరా సందర్భంగా టాలీవుడ్‌లో రెండు సినిమాల ప్రారంభాలు ఉంటాయని లీకులు/ అనధికార సమాచారాలు వచ్చాయి. ఆ రెండు అప్‌డేట్సూ లేవు. అవే రామ్‌చరణ్ – సుకుమార్ సినిమా, మోక్షజ్ఞ – మల్లిడి వశిష్ట సినిమా. ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీదనే రావాలి. కానీ ఆ సినిమా నిర్మాతలు ‘రణబాలి’ సినిమాను లిఫ్ట్ చేసే పనిలోనే ఉన్నారు. ఆ కారణమో, ఏ కారణమో కానీ రెండు కొత్త సినిమాలు స్టార్ట్ అవ్వలేదు.
‘ఫౌజీ’ సినిమా వాయిదా ఫిక్స్ అయినా.. ఎక్కడా అధికారికంగా పోస్టర్ కానీ, పోస్ట్ కానీ రాలేదు. ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న ఆ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్ లేదు. ‘స్పిరిట్’ సినిమా టీమ్ ఓ ఏడెనిమిది అడుగులు వెనక్కి వేసి దాదాపుగా ఏడాది ఆఖరకు వెళ్లిపోయి ‘ఫౌజీ’కి లైన్ క్లియర్ చేసింది. కానీ ఆ సినిమా టీమ్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
రికార్డు స్థాయిలో, ఇప్పటివరకు ఎప్పుడూ జరగనట్లు అనుకున్న సమయానికే ‘వారణాసి’ వచ్చేస్తుంది. రాజమౌళి మాట మీద నిలబడతారు అని మహేష్‌బాబు ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా తెగ సంబరపడిపోతున్నారు. అంటే ఇంకా ఏడు నెలలే ఉంది. అయితే ఎందుకో మరి ఆ సినిమా టీమ్ నుండి కూడా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ‘రాకా’ సినిమా సంగతి సరేసరి. అయిపోయింది, అయిపోతోంది, అయిపోవస్తోంది అంటూ చెబుతున్నా.. దసరాకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో అసలు ఎంతవరకు వచ్చిందనేది తెలియడం లేదు.
అలాగే డిసెంబరు ఆఖరున పక్కా వస్తాం.. అంటూ చెబుతున్నా ‘దాదా’, ‘కింగ్’ టీమ్‌ల నుండి ఎలాంటి పోస్టరూ లేదు. మన టార్గెట్ సంక్రాంతి అని చెప్పిన ‘కాకా’.. దసరాకు ఎలాంటి సందడీ చేయలేదు ఎందుకో?