ఇటీవల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రేక్షకులకి అందించిన విజువల్ వండర్స్ ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేని రోజుల్లోనే ఆయన విజువల్ వండర్స్ అందించారు. బాక్సాఫీస్ వద్ద కూడా అవి భారీ వసూళ్లు సాధించేవి. దీంతో చాలా మంది హీరోలు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఆశపడ్డారు.
అలా ఆశపడిన వారిలో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. సింగీతం దర్శకత్వంలో ఆయన చేయాల్సిన భూలోక వీరుడు సినిమా 2 షెడ్యూల్స్ పూర్తిచేసుకుని పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. చిరు మాదిరే పవన్ కళ్యాణ్ సైతం సింగీతం దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని భావించారు. కానీ అతని కోరిక కూడా తీరలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2010లో పవన్ కళ్యాణ్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ పేరుతో ఓ మైథాలజీ సినిమాని అనౌన్స్ చేశారు.
4 భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఏసుక్రీస్తు జీవితనికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సింగీతం భావించారు.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పాస్టర్ రోల్ చేయాలి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్వహించారు. జోర్డాన్, ఇజ్రాయిల్ వంటి లొకేషన్లలో హాలీవుడ్ టెక్నీషియన్లతో పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సింగీతం ప్రకటించారు.
కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరకపోవడం, అలాగే ఆరంభంలోనే ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో మధ్యలోనే ఆగిపోయింది ఈ క్రేజీ ప్రాజెక్టు. అధికారిక ప్రకటనతోనే ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.