హెడ్డింగ్ చూసి.. ‘ఓవైపు రామ్‌చరణేమో ‘పెద్ది’ సినిమా వాయిదా పడదు అని క్లారిటీ ఇస్తుంటే.. మీరేంటి మళ్లీ డౌట్’ అంటున్నారు అని మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ ‘పెద్ది’ వాయిదా అనే డౌట్‌ని తీసుకొచ్చింది మేం కాదు. ఆ సినిమా టీమే. ఇటీవల సినిమా టీమ్ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ప్రజలకు, సినిమా అభిమానులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ పోస్ట్ చేసింది. మొన్నీమధ్య వచ్చిన ‘పెద్ది’ టీజర్‌లో చరణ్ గద పట్టుకుని చేసిన విన్యాసాల నుండి ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇప్పటికే అభిమానులు, ప్రేక్షకులు చూసిన ఆ ఫొటోను మరోసారి రిలీజ్ చేశారు. హనుమాన్ జయంతి కాబట్టి ఆ పోస్టర్ రిలీజ్ చేశారు అనుకోవచ్చు. అయితే దాని మీద ఎక్కడా సినిమా రిలీజ్ డేట్ లేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా సినిమా పోస్టర్లు రిలీజ్ చేసి, అందులో డేట్ పెట్టి ప్రచారం చేసుకోవాలి అని చూస్తాయి సినిమా టీమ్‌లు. కానీ ‘పెద్ది’ సినిమా టీమ్ ఎందుకు రిలీజ్ డేట్ వేయలేదు అనేదే ఇక్కడ ప్రశ్న. అంటే సినిమా మరోసారి వాయిదా పడుతుంది అని చెప్పబోతున్నారా అనే డౌటనుమానం మొదలైంది.
ఇటీవల చెప్పిన దాని ప్రకారం అయితే మార్చి 26 నుంచి ఏప్రిల్ 30కి సినిమా వాయిదా పడింది. కొత్త డేట్‌కు ఇప్పుడు చూస్తే ఇంకా 27 రోజులే ఉంది. అయినా ఇంకా ప్రచారం షురూ చేయలేదు. చరణ్ కూడా ఇటీవల చిన్నగా గాయపడి తిరిగి షూటింగ్‌కి వచ్చాడు. ఇదంతా చూస్తే వాయిదా పడటం ఖాయం అని చెబుతున్నారు. కానీ ‘రాకాస’ సినిమా టీమ్ వెళ్లి చరణ్‌ను ‘పెద్ది’ సెట్స్‌లో కలిసినప్పుడు ‘పెద్ది’ వాయిదా అనే పుకార్లు వస్తున్నాయి.. టైమ్‌కి వస్తామని చెప్పండి అంటూ చరణ్ జోకేశాడు. మరి సినిమా టీమ్ బాంబు పేల్చి వాయిదా ప్రకటన ఇస్తుందా? లేక గుమ్మడికాయ కొట్టి రిలీజ్ ప్రకటిస్తారా అనేది చూడాలి.