రూ.11 కే సినిమా టికెట్టా.. ఏంటి జోక్ చేస్తున్నారా? అనే అంటారు ఎవరైనా ఈ మాట వింటే. కానీ ఇది నిజం. నిజంగానే ఆ సినిమా టికెట్‌ను రూ11కే ఇచ్చారు. అయితే కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే. హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో సాయంత్రం, నైట్ షోల్లో రూ.11కే టికెట్ ఇచ్చి సినిమా టీమ్ నిజంగానే ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు ఆ టికెట్‌లో అక్కడికెళ్లి వెళ్లి తీసుకోనక్కర్లేదు. ఎంచక్కా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇదంతా ఓకే ఆ సినిమా ఏంటనేగా డౌట్.. ‘నిలవే’. అవును మన తెలుగు సినిమానే.
సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ ప్రధాన పాత్రల్లో సౌమిత్, సాయి వెన్నం సంయుక్తంగా రూపొందించిన సినిమా ఇది. రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి వెన్నం నిర్మించిన ఈ సినిమాను 13వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి పేరే తెచ్చుకుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు రూ.కోటికిపైగా గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ ఉండటంతో ఈ సినిమా స్క్రీన్స్ సంఖ్య పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఆఫర్ ప్రకటించింది.
ఈ శనివారం నాడు అంటే ఈ రోజే రూ.11 కే టికెట్ ఇస్తాం అని చెప్పింది. సినిమాలో 11 పాటలు, 11 ఎమోషన్స్ ఉన్నాయని చెప్పిన టీమ్.. రూ.11కే టికెట్ ఇస్తామని ప్రకటించారు. ఇది నిజమా కాదా అని ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో చూస్తే అదే రేటుకు సినిమా టికెట్లు అమ్మడం కనిపించింది. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మరిన్ని సినిమా టీమ్‌లు ఈ ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇది సినిమాకు పెద్ద ప్రచారమే తెచ్చిపెడుతుంది. మిగిలిన షోలకు జనాలు పెరగొచ్చు.
కొన్ని రోజుల క్రితం రూ.99కి ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టికెట్లు ఇవ్వడమే ప్రచారంలో కలిసొచ్చింది అని ఇండస్ట్రీ టాక్. అయితే ఆ ఆఫర్ ఎక్కువ రోజులు లేదు. ఆపేశారో/ ఆపేయించారో తెలియదు కానీ మరి ఈ సినిమా టీమ్ ప్లాన్‌ని ఇండస్ట్రీ ఎలా తీసుకుటుందో చూడాలి.