చిత్ర పరిశ్రమలో వారసత్వం అనేది కామన్. హీరో కొడుకులు హీరోలుగా పరిచయం కావడం, వారిలో కొందరు స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడం, కొందరు సక్సెస్ కాలేక మధ్యలోనే వెళ్లిపోవడం చూస్తూ ఉంటాం. హీరోల కొడుకు హీరోలు అయినట్లే హీరోయిన్స్ కూతుళ్లు కూడా హీరోయిన్స్ గా రాణించినవారు చిత్ర పరిశ్రమలో చాలా ఉన్నారు వారిలో కొందరు వెండితెరనే కాకుండా రాజ్యాలను కూడా ఏలారు. హీరోయిన్స్ గా పరిచయమైన హీరోయిన్స్ కూతుళ్లలలో కొందరి ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను.
వేదవల్లి – జయలలిత :
తమిళ పరిశ్రమలో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన జయలలిత జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జయలలిత తమిళ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఐతే ఆమె తల్లిగారు వేదవల్లి కూడా నటి కావడం విశేషం .జయలలిత తల్లిగారు వేదవల్లి చిత్రరాజం గా భావించే మాయాబజార్ వంటి చిత్రాలలో నటించారు. నటిగా వెండితెరను ఏలిన జయలలిత తరువాత తమిళనాట యంగెస్ట్ సి ఎమ్ గా పదవిని చేపట్టింది.
లక్ష్మీ- ఐశ్వర్య :
ఇప్పటి తరానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమున్న సీనియర్ నటి ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. ఆమె హీరోయిన్ గా అనేక చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస చిత్రాలలో చేస్తున్నారు. కాగా లక్ష్మీ కూతురు ఐశ్వర్య కూడా 90లలో హీరోయిన్ గా అనేక చిత్రాలలో నటించారు. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఓ బేబీ సినిమాలో లక్ష్మీ కీలక రోల్ చేయగా ఆమె కూతురు ఐశ్వర్య హీరో నాగశౌర్య తల్లిపాత్ర చేశారు.
శ్రీదేవి-జాన్వీ కపూర్ :
నటి శ్రీదేవి లెగసి, వెండితెరపై ఆమె వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో అన్ని పరిశ్రమలలో సినిమాలు చేసి, అందరినీ గెలిచిన ఒకే నటి శ్రీదేవి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు కాగా వారిలో జాన్వీ కపూర్ కెరీర్ మొదలుపెట్టింది. ఆమె ఇప్పటి వరకు చేసింది ఒక్క చిత్రమే కానీ క్రేజ్ పీక్స్ అని చెప్పాలి. టాలీవుడ్ లో ఆమెను నటింపచేయాలని దర్శక నిర్మాతలు అనేక ప్లాన్స్ వేస్తున్నారు.
రాధా- కార్తీక, తులసి :
80-90లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు నటి రాధా. ఆ జెనరేషన్ లో మంచి డాన్సర్స్ లో రాధ ఒకరు. స్క్రీన్ పై చిరు, రాధ స్టెప్స్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచాయి. రాధకు ఇద్దరు కుమార్తెలు కాగా ఇద్దరు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కార్తీక, నాగ చైతన్య జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆమె నటించిన రంగం మూవీ తెలుగులో కూడా మంచి విజయం అందుకుంది. ఇక రెండవ కూతురు తులసి మణిరత్నం తెరకెక్కించిన కడలి చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
జీవిత- శివాని, శివాత్మిక :
హీరోయిన్ జీవిత రాజశేఖర్ కి ఇద్దరు కుమార్తెలు. కాగా చిన్న కూతురు శివాత్మిక దొరసాని చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ మూవీలో నటనకు ఈమెకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూతురు పాత్ర చేస్తుంది. పెద్ద కూతురు శివాని నటిస్తున్న మూవీ షూటింగ్ దశలో ఉంది.
లిస్సి- కళ్యాణి ప్రియదర్శన్ :
హీరోయిన్ లిస్సి తెలుగు ప్రేక్షకులను అంతగా పరిచయం లేదు. ఈమె మలయాళ చిత్రాలలో ఎక్కువగా నటించింది. ఈమె కూతరు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పలుచిత్రాల్లో నటిస్తుంది. అక్కినేని హీరో అఖిల్ హీరోగా వచ్చిన హలో మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ నటించారు. అలాగే రణరంగం మూవీలో శ్వరానంద్ సరసన కూడా చేయడం జరిగింది.
మేనక- కీర్తి సురేష్ :
మేనక 80లలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. తెలుగులో ఈమె చిరంజీవి హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పున్నమి నాగు సినిమాలో హీరోయిన్ గా చేశారు. ఈమె కూతురే మన మహానటి ఫేమ్ కీర్తి సురేష్. నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి ఫాలోయింగ్ ఏమిటో అందరికీ తెలిసిందే. దాదాపు ఆమె మూడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. రంగ్ దే సినిమాలో నితిన్ కి జంటగా నటిస్తున్నారు.
మంజుల- వనిత, ప్రీతి, శ్రీదేవి :
సీనియర్ స్టార్ హీరోయిన్ మంజులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు వెండితెరకు హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. వనిత కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోసియో ఫాంటసీ మూవీ దేవిలో నటించారు. ఇక మరో అమ్మాయి ప్రీతీ రుక్మిణి, మా అన్నయ్య, ప్రియమైన నీకు చిత్రాలలో నటించారు. మరో కూతురు శ్రీదేవి ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ లో హీరోయిన్ గా నటించింది.
సారిక- శృతి హాసన్, అక్షర హాసన్ :
కమల్ హాసన్ మొదటి భార్య సారిక కూడా హీరోయిన్. ఆమె హిందీ చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్, సౌండ్ డిజైనర్ గా కూడా పనిచేశారు. ఇక సారికకు శృతి హాసన్, అక్షర హాసన్ ఇద్దరు కూతుళ్లు. శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో అనేక సినిమాలు చేసింది. హిందీలో కూడా శృతి హాసన్ చిత్రాలు చేయడం విశేషం. రెండో కూతురు అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా కొనసాగుతుంది.