నంది అవార్డు దక్కకపోవడంపై కమెడియన్ పృథ్వీ తీవ్ర వ్యాఖ్యలు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించిన నంది అవార్డులు టాలీవుడ్‌లో ప్రకంప‌న‌లు సృష్టిస్తున్నాయి. అవార్డులు ప‌క్ష‌పాతంతో ఇచ్చార‌ని విమ‌ర్శ‌లు విన‌బ‌డుతున్నాయి. అవార్డులు ద‌క్క‌ని వారు త‌మ అసంతృప్తిని బాహాటంగా వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా క‌మెడియ‌న్ పృథ్వి కూడా త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. తనకు ‘లౌక్యం’ సినిమాకు నంది అవార్డు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘అవార్డు అందుకునే స్థాయి ఇంకా నీకు రాలేదురా అని కమిటీ వాళ్లు అన్నట్లుగా అనిపిస్తోందని పృథ్వీ అన్నాడు.

ఏ ఏడాది అవార్డులు ఆ ఏడాదే ఇస్తే ఆ సినిమా సత్తా ఏంటో తెలుస్తుందని.. ఇలా గ్యాప్ ఇచ్చి ఒకేసారి మూడేళ్లకు అవార్డులివ్వడం కరెక్ట్ కాదని పృథ్వీ అభిప్రాయపడ్డాడు. కొని తెచ్చుకున్న అవార్డులు బయటకు వెళ్లినప్పుడు వెక్కిరిస్తాయని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో అన్న విషయాన్ని పృథ్వీ గుర్తుచేయడం విశేషం. ‘మీ యాక్టింగ్ బాగుంటుంది. మాకు నచ్చింది.. అవార్డులదేముంది’ అని ప్రేక్షకులు తనతో అంటుంటారని.. మంచి నటులకు ఎందుకు అవార్డులు రావడం లేదన్న భావన ప్రజల్లో కూడా ఉందని అనడం ద్వారా పృథ్వీ పరోక్షంగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

మరియు నంది అవార్డుల విషయంలో తమ సినిమాకు అన్యాయం జరిగిందని రేసుగుర్రం సినిమా ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ‘రుద్రమదేవి’ సినిమాకు జరిగిన అన్యాయంపై దర్శక నిర్మాత గుణశేఖర్ కూడా ఘాటుగానే స్పందించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus