సపోర్టింగ్ యాక్టర్ గా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి అనంతరం స్టార్ కమెడియన్ గా ఎదిగిన సప్తగిరి ఇప్పుడు రైటర్ గా మారుతున్నాడు. అది కూడా తను హీరోగా తెరకెక్కబోయే చిత్రం కోసం. తనను హీరోగా పెట్టి “సప్తగిరి ఎక్స్ ప్రెస్” చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే తాజా చిత్రం కోసం సప్తగిరి స్వయంగా స్క్రిప్ట్ రాసుకొంటున్నాడట. ఆల్రెడీ హీరోగా “సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి” చిత్రాలతో హీరోగా తన స్టామినా ప్రూవ్ చేసుకొన్న సప్తగిరి మూడో చిత్రంతో హీరోగా నిలదొక్కుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడు.
ఏదో వరుసబెట్టి అవకాశాలు రావడంతో కమెడియన్ గా సెటిల్ అయ్యాడే కానీ.. నిజానికి సప్తగిరి ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్టర్ అవుదామని. అందుకే బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అనుకోకుండా “పరుగు” చిత్రంతో నటుడైన సప్తగిరికీ “ప్రేమకథా చిత్రం” హిట్ అవ్వడం, ఆ హిట్ లో సప్తగిరి పోషించిన కామెడీ రోల్ ప్రత్యేక పాత్ర పోషించి ఉండడంతో ఇక మనోడికి ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో డైరెక్టర్ అవుదామనుకొన్న సప్తగిరి కాస్తా స్టార్ కమెడియన్ అయిపోయి బ్రాహ్మానందంకి కూడా పోటీగా నిలిచాడు.
మరి హీరోగా వస్తున్న ఆఫర్లతో తబ్బిబ్బయిపోయి కమెడియన్ రోల్స్ ను పక్కనపెట్టేస్తాడో లేక సమయాన్ని సద్వినియోగపరుచుని ఒకపక్క కమెడియన్ గా, మరోపక్క హీరోగానూ రెండు పడవల ప్రయాణాన్ని సక్రమంగా చేసుకుంటాడో చూడాలి.