గతంలో వెంకటేష్ తో ‘శత్రువు’, ఉదయ్ కిరణ్ తో ‘మనసంతా నువ్వే’, మహేష్ బాబుతో ‘ఒక్కడు’, ప్రభాస్ తో ‘వర్షం’, సిద్దార్థ్ తో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలు నిర్మించిన ఎం ఎస్ రాజు.. కొంతకాలంగా దర్శకుడిగా కూడా సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్నారు ఎం ఎస్ రాజు. అందులో భాగంగా ఈసారి ‘అగధ’ (Agadha) అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రమోషన్స్ లో ఆగస్టు 15న సక్సెస్ మీట్ పెట్టుకుంటాను’ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. మరి ఆయన కాన్ఫిడెన్స్ కి తగ్గట్టుగా ఈ సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి:
కథ: ఛత్తీస్‌గఢ్ సమీపంలోని బస్తర్ అటవీ ప్రాంతంలో కథ మొదలవుతుంది. మహిమ (ఉల్కా గుప్తా) ఓ చిన్న పాపను ఎత్తుకుని, కొంతమంది అడవి మనుషుల నుండి తప్పించుకోవడానికి పరుగెత్తుతూ ఉంటుంది. ఆమె ఒకచోట ఆగినప్పుడు తనతో పాటు వచ్చిన బబ్లూ (వైవా రాఘవ్) కనిపిస్తాడు. అతను మహిమకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే… ఎవరో కత్తితో అతని తల నరికేస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి గర్భవతిగా ఉన్న మహిమ ఉరేసుకుని చనిపోతుంది.ఈ విషయం తెలుసుకున్న మహిమ కజిన్ మహాదేవి (కామాక్షి భాస్కర్ల) వెంటనే మన్యం జిల్లా, సాలూరులో ఉన్న మహిమా ఇంటికి వెళ్తుంది.
ఆమె అమ్మవారి అంశతో పుట్టిన వ్యక్తి కావడంతో, ఆమెకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి. మహాదేవి ఆ ఇంటికి రాగానే కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా తన బాబాయ్ చిన్న కూతురు హరిణి (జోవిక విజయ్) చాలా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. మరోవైపు మహిమ మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్న మహాదేవికి కొన్ని దుష్టశక్తుల గురించి తెలుస్తుంది. ఆ దుష్టశక్తులను పాలిస్తున్నది ‘అగధ’ అని ఆమె గ్రహిస్తుంది. అసలు ఈ ‘అగధ’ (Agadha) ఎవరు? మహిమకు, అగధకు ఉన్న సంబంధం ఏంటి? మహిమ కుటుంబానికి చెందిన వారిని ‘అగధ’ ఎందుకు బలితీసుకుంటుంది? మహిమను ప్రేమించిన సింహా (శ్రవణ్ రెడ్డి) ఏమయ్యాడు? చివరికి మహాదేవి ‘అగధ’ను ఎలా అంతమొందించింది? ఈ పోరాటంలో జర్నలిస్ట్ మానస (శ్రేయ రాణిరెడ్డి), సంజయ్ (రోషన్ బషీర్) ఆమెకు ఎలా సహాయపడ్డారు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: ముందుగా మహాదేవి పాత్ర చేసిన కామాక్షి భాస్కర్లకి ఫుల్ మర్క్స్ పడిపోతాయి. ఆమె కెరీర్ ను గమనిస్తే.. ఇప్పటివరకు ఆమె ఎక్కువగా చేసింది బోల్డ్ పాత్రలే. కానీ ఆమె ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ కూడా చేయగలను అని ‘అగధ’తో చాటి చెప్పింది. ఆమె వాయిస్ కూడా కొన్ని చోట్ల పవర్ఫుల్ గా అనిపించింది. ఓన్ డబ్బింగ్ కావడంతో పాత్ర చాలా ఒరిజినల్ గా అనిపిస్తుంది. శ్రవణ్ రెడ్డి 2 రకాల పాత్రలను ఎంతో ఈజ్ తో చేశాడు. జోవిక కొన్ని చోట్ల భయపెట్టింది.
ముఖ్యంగా స్కూల్ సీన్లో అలాగే చర్చ్ సీన్లో జోవిక బాగా చేసింది. ఆమె సన్నివేశాలు ఇంకొన్ని ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. బాబా పాత్రలో సిజ్జు చాలా కొత్తగా కనిపించారు. అసలు ఆ పాత్ర చేసింది సిజ్జు అంటే నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. అతని మేకోవర్ అంత బాగా కుదిరింది. భాను చందర్, వనితా విజయ్ కుమార్..ల పాత్రలకి పెద్దగా స్కోప్ లేదు. ‘దేవి’ ఫీల్స్ రప్పించడానికి పెట్టినట్టు ఉన్నాయి. మిగతా వాళ్ళ పాత్రలు ఓకే.
సాంకేతిక నిపుణుల పనితీరు: హర్రర్ సినిమాలు ఒకే రకంగా ఉంటున్నాయి అనే విమర్శలు ఎక్కువగానే వింటున్నాం. ఒక దెయ్యం. మొదట్లో అది క్రూరంగా కనిపించడం. తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో గొప్పగా చూపించడం.. క్లైమాక్స్ లో మంచి దెయ్యంగా చూపించి శుభం కార్డు వేయడం ఒక రకమైన హారర్ ఫార్ములా. రెండోది క్రూరమైన దెయ్యం.. దానిని అంతం చేయడానికి చివర్లో ఒక డివైన్ పవర్ అవసరం పడటం అనేది మరో రకమైన హారర్ ఫార్ములా. ఈ ‘అగధ’ మాత్రం రెండిటికీ భిన్నంగా ఉంటుంది. దర్శకుడు ఎం ఎస్ రాజు ‘అగధ’ ఫస్ట్ హాఫ్ అంతా ఓ సస్పెన్స్ డ్రామాగా నడిపించారు. అలా అని హారర్ ఎలిమెంట్స్ లేవని కాదు. ఉన్నాయి..! కానీ వాటిపైనే ఆధారపడలేదు. ఎన్నో రకాల ప్రశ్నలు లేవనెత్తుతూ ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది.
సెకండాఫ్ లో ఫారెస్ట్ ఎపిసోడ్స్ బాగుంటాయి. పొలాల్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా ఓకే. కానీ సెకండాఫ్ లో ఎక్కడో కథ ట్రాక్ తప్పిందేమో అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ప్రీ క్లైమాక్స్ తో మళ్ళీ హై ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకులు ఎం ఎస్ రాజు. అయితే కథలో ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ ఉంటే బాగుండేది. కథకి ఆ స్కోప్ కూడా ఉంది. ఒకవేళ అలా చేసి ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవారు. కానీ ‘ఎ’ రేటింగ్ సినిమా కావడంతో ఆ ఎలిమెంట్స్ జోలికి పోలేదేమో అనుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు లేకపోవడం అనేది సినిమాకి మరో కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. రన్ టైం కూడా పరిమితులు దాటలేదు.
విశ్లేషణ: మొత్తంగా ‘అగధ’ ఎం ఎస్ రాజు చేసిన ఓ కొత్త అటెంప్ట్. కొంతమందిని సర్ప్రైజ్ చేయొచ్చు, ఇంకొంతమందికి పర్వాలేదు అనిపించొచ్చు. కానీ కచ్చితంగా డిజప్పాయింట్ అయితే చేయదు. ఈ లాంగ్ వీకెండ్ కి హ్యాపీగా థియేటర్లలో ఒకసారి ట్రై చేయొచ్చు.
ఫోకస్ పాయింట్: డీసెంట్ హారర్ డ్రామా
రేటింగ్: 2.75/5