కొన్ని నెలల క్రితం ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్‌కు ( Ajith Kumar) యాక్సిడెంట్ జరిగింది అని వార్తలొచ్చాయి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనే వివరాలు అప్పుడు చెప్పలేదు కానీ.. ఓ షూటింగ్ సమయంలో రిస్కీ షాట్ చేసినప్పుడు యాక్సిడెంట్ జరిగింది అని మాత్రం చెప్పారు. అయితే ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు అలా అయింది అనే వివరాలను సినిమా టీమ్ తెలిపింది. ఆ యాక్సిడెంట్‌కి కారణమైన వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అజిత్‌కు స్టంట్స్ అంటే చాలా ఇష్టం. సినిమాల్లో రైడింగ్ సన్నివేశాలను ఆయన డూప్ లేకుండా చేస్తుంటారు. గతంలో ఈ మేరకు మనం కొన్ని సీన్లు, మేకింగ్ వీడియోలు కూడా చూశాం. అలా ఆయన తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో ఓ కారు డ్రైవింగ్ సీన్ చేశారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ‘విదా మయూర్చి’ సినిమాలో అజిత్ సరసన త్రిష (Trisha) నటిస్తోంది. గతేడాది నవంబర్‌లో ఈ యాక్షన్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు.
ఎప్పట్లానే అజిత్ ఆ రోజు డూప్ లేకుండా ఆ సీన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఏమైంది అనే వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసింది. ఓ సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్ ఫాస్ట్‌గా కారు డ్రైవ్ చేయాలి. డూప్ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు. అయితే ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదం నుండి అజిత్, పక్కనున్న నటుడు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ‘ ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో’ అంటూ ఆ వీడియోను టీమ్ షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే ఇలాంటి రిస్క్‌లు ఇప్పుడు వద్దు సర్… మీరు జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నారు.
https://twitter.com/LycaProductions/status/1775798815926395119?t=CtRxkfFi4IPRLEEKILpyuw&s=19