ప్రముఖ కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భుజాలకు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని ముంబయి వైద్యులు ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. రొటేటర్ కఫ్, భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో తీవ్ర గాయం అవ్వడంతో సర్జరీ తప్పదని డాక్టర్లు తేల్చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోమవారం రాత్రి అధికారికంగా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, పవన్ సన్నిహితుడు బండ్ల గణేశ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. అందులో గాయం గురించి వివరంగా రాసుకొచ్చారు. పవన్ అంత బాధను 15 ఏళ్లుగా ఎలా భరిస్తున్నారో అంటూ ఈ గాయం ఎప్పటిదో చెప్పారు.
15 ఏళ్లుగా పవన్ కల్యాణ్ నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే గుండె బరువెక్కిపోయింది. ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ రోజులు గుర్తొస్తున్నాయి. గుజరాత్‌లో జరిగిన ప్రమాదం అది. ఓ రోజు షూటింగ్‌లో గుర్రం మీద నుంచి పవన్ పడిపోయిన ఆ క్షణం కళ్ల ముందే కదలాడుతోంది. ఆ రోజు వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు కూడా. కానీ పవన్ ‘ముందు సినిమా పూర్తి చేద్దాం. నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు. ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు’ అని అన్నారు అని బండ్ల గణేశ్ చెప్పారు.
అనుకున్నట్లుగా ఆపరేషన్‌ను వాయిదా వేసి, షూటింగ్ చేసి, సినిమా విడుదలయ్యే వరకూ అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు.. జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చుకోలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది. మీరు అనుభవించిన నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి అని దేవుణ్ని ఒక్కటే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన రియల్ హీరో’’ అని బండ్ల గణేశ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇప్పుడు పవన్‌కు వచ్చిన అనారోగ్యానికి, ‘గబ్బర్ సింగ్’ ప్రమాదానికి సంబంధం ఉందా లేదా అనేది తెలియదు. సన్నిహిత వర్గాల సమాచారం అయితే అప్పటి ప్రమాదమే ఇప్పుడు సమస్యకు కారణం అని అంటున్నారు.