సినిమా – సెన్సార్.. ఈ రెండింటి మధ్య ఎలాంటి బంధం ఉందో అందరికీ తెలుసు. సెన్సార్ అయితే కానీ సినిమా బయటకు రాదు. దీని కోసం కేసులు, కోర్టులు, చర్చలు.. వామ్మో పెద్ద కథే నడుస్తోంది ఈ మధ్య. ఇన్నాళ్లూ ఈ ఝంఝాటం వెండితెరకు మాత్రమే ఉండింది. ఆ తర్వాత కొన్ని రోజులకు టీవీలకు కూడా వర్తింపజేశారు. థియేటర్ల కోసం సెన్సార్ చేసిన సినిమాను.. టీవీల్లో యథాతథంగా వేయడం లేదు. అయితే యూ, యూ/ఎ ఉంటే వేసేయొచ్చు అనుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఓటీటీలకు కూడా వర్తించబోతోంది అని సమాచారం.
అవును, మీరు చదివింది నిజమే. ఆర్జీవీ లాంటి సినిమా దర్శకులు ‘ఓటీటీకి సెన్సార్ లేదు కదా..’ అంటూ తమకు నచ్చినట్లుగా సినిమా తీసేసి.. నచ్చితే చూడండి లేకపోతే లేదు అని చెప్పిన రోజులు మనం చూశాం. ఇంకొన్నయితే ప్రజలకు నిజాలు చెప్పాలనుకుని.. సెన్సార్ దగ్గర ఆగిపోతున్నాయి. అలాంటి నేరుగా ఓటీటీకి వచ్చి.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తే ఆగిపోతున్నాయి. మొన్నీమధ్య ‘సత్లుజ్’ సినిమా అలా ఆగిపోయిందే.
ఈ చర్చ ఇంకా నడుస్తున్న ఈ సమయంలో ఇప్పటివరకూ వెండితెరపై విడుదలయ్యే సినిమాలకు మాత్రమే ఉన్న సెన్సార్ నిబంధన ఇకపై ఓటీటీ సినిమాలకూ వర్తించేలా కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఓటీటీ కంటెంట్‌ను ఐటీ నిబంధనలు – 2021 ప్రకారం నియంత్రిస్తారు. ఈ కంటెంట్‌కు సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ అవసరం లేదు. దీంతో సెన్సార్ నిరాకరించిన, వివాదాస్పదమైన చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నిబంధనలను సవరించి, ఓటీటీ చిత్రాలకు సెన్సార్ సర్టిఫికేట్‌ను జారీ చేసే ఆలోచన చేసిందని టాక్. సినిమాలకు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్‌లను కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ అంశంపై సమాలోచనలు, అభిప్రాయ సేకరణలు చేయాలని చూస్తున్నారట. దిల్జీత్ సింగ్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ సినిమా వివాదాస్పదమైంది. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు భారీ కట్స్ సూచించడంతో చిత్రబృందం కట్స్ చేయకుండా ఓటీటీలోకి విడుదల చేసింది. అయితే రెండు రోజుల్లోనే ఓటీటీ నుండి సినిమాను తొలగించేశారు.