ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ హరీష్ శంకర్ మంచి స్నేహితులు. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ మూడు సినిమాలు చేశారు. “రామయ్య వస్తావయ్యా” ఫెయిల్ అయినప్పటికీ హరీష్ శంకర్ కి దిల్ రాజు ఛాన్స్ ఇచ్చారు. ఇద్దరి కాంబినేషన్లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథమ్ సినిమాలు వచ్చాయి. లాభాలను అందించాయి. మళ్ళీ ఈ కాంబోలో “దాగుడు మూతలు” అనే మల్టీస్టారర్ సినిమా ప్రారంభం కావాల్సింది. దిల్ రాజుకి కథ నచ్చకపోవడంతో అది పట్టాలెక్కలేదు. చివరకి దిల్ రాజే కథని సెలక్ట్ చేశారు. ఇటీవల తమిళంలో విడుదలైన ’96’ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.
రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన విధానం నచ్చడంతో తెలుగులో రీమేక్ చేయాలనీ దిల్ రాజు ఫిక్స్ అయ్యారు. ఆ కథని హరీశ్ శంకర్ చేతిలో పెట్టినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అతను తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేయనున్నారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి అయిన తర్వాత ఆర్టిస్టుల ఎంపిక జరగనుంది. దిల్ రాజు ప్రస్తుతం రామ్ తో “హలో గురు ప్రేమ కోసమే”, వెంకటేష్, వరుణ్ తేజ్ లతో “ఎఫ్2 “, మహేష్ బాబుతో మహర్షి మూవీ నిర్మిస్తున్నారు. వీటి తర్వాత దిల్ రాజు నిర్మాణంలో సెట్స్ పైకి వెళ్లబోయే మూవీ “96 ” అనేది ఖరారు అయిపోయింది.