శ్రీవిష్ణుకి ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ ఉంది. కెరీర్ ప్రారంభం నుండీ అతను వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. అయితే అతనికి సక్సెస్ కట్టబెట్టిన సినిమాల్లో ఎక్కువ శాతం కామిడీ ఎంటర్టైనర్లే ఉన్నాయి. ‘నీదీ నాదీ ఒకే కథ’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘మృత్యుంజయ్’ వంటి సీరియస్ సినిమాలు చేసినా.. అవి కమర్షియల్ గా అంతంత మాత్రమే పే చేశాయి. ‘రాజ రాజ చోర’ ‘సామజవరగమన’ వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో.. అప్పటి నుండీ కామిడీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నాడు శ్రీవిష్ణు.
ఈ క్రమంలో అతను చేసే సినిమాల్లో మిగతా సినిమాలపై ఫన్నీ సెటైర్లు కూడా ఉంటాయి. ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. ఇండస్ట్రీలో ఇవి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంటాయి. ‘సామజవరగమన’ సినిమాలో బాలయ్యని ఇమిటేట్ చేస్తూ శ్రీవిష్ణు డైలాగులు చెబుతాడు. కానీ వాటిని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. ఫ్లోలో వెళ్లిపోయాయి. కానీ ‘సింగిల్’ సినిమా ట్రైలర్లో ‘శివయ్యా’ డైలాగ్ పై మంచు విష్ణు చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఆ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇక తర్వాత ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాలో ‘ప్యారడైజ్’ కానీ అంటూ పెట్టిన డైలాగ్ పరోక్షంగా ‘ప్యారడైజ్’ సినిమాపై సెటైర్ వేసినట్టు ఉందని చాలా మంది ఆరోపించారు. ఆ సినిమా వచ్చి వెళ్లి 2 నెలలు కాకుండానే.. ఇప్పుడు ‘ఫ్యామిలీ ప్యాక్'(Family Pack) సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. ఈ టీజర్లో కూడా పక్క సినిమాలపై సెటైర్లు గట్టిగానే ఉన్నాయి.
అన్నీ ఎలా ఉన్నా.. చివర్లో ‘గుర్తింపు కథలు వద్దు.. ఫ్యామిలీ కథలే రాయండి’ అంటూ శ్రీవిష్ణు పలికిన డైలాగ్ కూడా ఒక రకంగా ‘ప్యారడైజ్’ పై సెటైర్ వేసినట్టే ఉంది అంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. అంతేకాదు ‘పెద్ది’ ‘పుష్ప’ ‘పుష్ప 2’ వంటి సినిమాలు కూడా గుర్తింపు కాన్సెప్ట్ తోనే వచ్చాయి. అయితే తన ‘శ్వాగ్’ సినిమా కూడా గుర్తింపు కథతోనే వచ్చిందని, అది కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు అంటూ శ్రీవిష్ణు ఆ డైలాగ్ పై వివరణ ఇచ్చి అందరినీ కూల్ చేసే ప్రయత్నం చేశాడు.