‘కరుప్పు’/ ‘వీరభద్రుడు’ సినిమా టైటిల్ కార్డ్స్‌లో ‘థ్యాంక్స్ విజయ్’ అంటూ ఓ కార్డు పడింది. అది చూసి ఆయన సీఎం అయ్యారు కాబట్టి ఇలా వేశారు అని కొందరు.. సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చినందుకు అలా చేశారు అని మరికొందరు చెప్పుకొచ్చారు. మరికొందరు అయితే విజయ్, సూర్య మితృత్వం వల్ల అలా చేశారు అని అన్నారు. అయితే అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తాజాగా చెప్పారు ఆ సినిమా దర్శకుడు ఆర్జే బాలాజీ. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది.
సూర్య ‘కరుప్పు’ సినిమాను తొలుత విజయ్ కోసం సిద్ధం చేసినట్లు దర్శకుడు ఆర్జే బాలాజీ ఇంతకుమందే చెప్పారు. ఇప్పుడు టైటిల్ కార్డుకి దానికి సంబంధం ఉందని చెప్పారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు కెరీర్‌లో చివరి సినిమాగా ‘కరుప్పు’ చేయాలని అనుకున్నట్లు బాలాజీ తెలిపారు. తాము రెండు, మూడు సార్లు సమావేశమై ఈ సినిమా గురించి చాలాసేపు చర్చించుకున్నామని… అప్పుడే ‘కరుప్పు’ సినిమా స్క్రిప్ట్ వినిపించానని బాలాజీ తెలిపారు.
దానికి విజయ్ షూటింగ్ వెంటనే ప్రారంభించగలవా అని అడిగారట. కానీ షూటింగ్‌కి కాస్త సమయం కావాలని చెప్పారట బాలాజీ. ఆ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ సినిమాలో నటించలేకపోయారు అని ఆయన తెలిపారు. ఆ సమయంలోనే సూర్యతో సినిమా చేయాలని నిర్మాతలు కోరారట. దీంతో ‘కరుప్పు’ కథను సూర్యకు తగినట్లు మార్చాను అని బాలాజీ క్లారిటీ ఇచ్చారు.