‘కేజీయఫ్’ సినిమా వచ్చే ముందు వరకు యశ్ వేరు.. ఆ సినిమాలు వచ్చి భారీ విజయం సాధించాక యశ్ వేరు. ఇది ఎవరూ కాదనలేని విషయం. శాండిల్ వుడ్‌లో యశ్ ఎన్నో ఏళ్ల నుండి ఉన్నా.. ‘కేజీయఫ్’ సినిమాల తర్వాత యశ్ స్థాయి మారిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత యశ్ చాలా గ్యాప్ ఇచ్చాడు. ఈ లోపు ఆయన మీద చాలా రకాల కామెంట్లు వచ్చాయి. ఆ మాటకొస్తే అంతకుముందే వచ్చాయి. ఇన్నాళ్లూ ఈ ప్రశ్నలకు యశ్‌ను అడిగే పరిస్థితి రాలేదు.. ఆయన సమాధానం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు వాటికి సమాధానం ఇచ్చారు.
యశ్ ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గతంలో తన గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ కథానాయిక రష్మిక మందన చేసిన కొన్ని కామెంట్లకు యశ్ రిప్లైలు వచ్చాయి. ‘కేజీయఫ్’ సినిమా వల్ల నాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మాట నిజమే. అయితే ఒక సినిమా విజయం నిర్మాతకు మాత్రమే సొంతం అని నేను నమ్మను. ఆ విజయం వెనక ఎంతో మంది శ్రమ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి రైటర్ల వరకు అందరూ కష్టపడి పని చేస్తేనే మంచి అవుట్‌పుట్ వస్తుంది అని చెప్పాడు యశ్.
తాను ప్రధానపాత్రలో బాగా నటించినా ఇతరులు సరిగ్గా పనిచేయలేకపోతే ఆ సినిమా విజయం సాధించదు. ఎంతటి స్టార్ హీరో తలరాతనైనా ఓ శుక్రవారం డిసైడ్ చేస్తుందని యశ్ వేదాంతం స్టైల్‌లో చెప్పాడు. సినిమా సరిగ్గా ఆడకపోతే పాన్ ఇండియా ట్యాగ్ కూడా మాయమైపోతుందని క్లారిటీగా మాట్లాడాడు. ఇంతకీ అల్లు అరవింద్ ఏమన్నారు అంటే.. ‘కేజీయఫ్’ సినిమాకు ముందు యశ్ ఎంతమందికి తెలుసు చెప్పండి. భారీ స్థాయిలో సినిమాను నిర్మించారు కాబట్టే ఆ చిత్రానికి అంత క్రేజ్ వచ్చింది అని అరవింద్ అన్నారు.
ఇక రష్మిక సంగతి చూస్తే.. సుమారు పదేళ్ల క్రితం ఆమె యశ్ గురించి మాట్లాడుతూ ‘మిస్టర్ షో ఆఫ్’ అని కామెంట్ చేసింది. దీని గురించి యశ్ మాట్లాడుతూ రష్మిక ఏ ఉద్దేశంతో అలా అందో నాకు తెలియదు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త. అయినా ఆ మాటలను నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది. అయినా, ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ నిర్ణయించలేదు అని క్లారిటీ ఇచ్చాడు.